Share News

దేవరగట్టుపై శివనాదం

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:39 PM

రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

దేవరగట్టుపై శివనాదం

ఆకట్టుకున్నగొరవయ్యల నృత్యం

4వ ప్రయత్నంలో తెగిన ఇనుప గొలుసు

నేటితో బన్ని ఉత్సవాల ముగింపు

హొళగుంద, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవరగట్టుపై శివనాదం మార్మోగింది. శుక్రవారం దేవరగట్టులో జరిగిన గొరవయ్యల నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల్లో కీలక ఘట్టంగా భావించే గొలుసు తెంపే ఉత్సవాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అర్చకులు నిర్ణయించిన సమయం ఉదయం 9 గంటలకు బల్లూరుకు చెందిన గొరవయ్య గాదిలింగ ఇనుప గొలుసును 4వ ప్రయత్నంలో తెంపి ఔరా అనిపించారు. దేవరగట్టు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం దేవదాసీల క్రీడలు సైతం ఆకర్షణీయంగా సాగాయి. బన్ని ఉత్సవాల్లో సోమవారం చివరి ఘట్టమైన వసంతోత్సవంలో భక్తులపై గొరవయ్యలు రంగులను చల్లి ఘనంగా కంకణ విసర్జన చేపడతారు. దీంతో బన్ని ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఐ రవిశంకర్‌ రెడ్డి, హొళగుంద, హాలహర్వి, తుగ్గలి ఎస్‌ఐలు గురజాల దిలీప్‌ కుమార్‌, మారుతి, బాలనరసింహులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోస్ట్‌ మల్లికార్జున, కురువ సోమప్ప, వీర నాగప్ప, రాజశేఖర్‌, వైసీసీ నాయకులు ఎస్‌కే గిరి, రామునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:39 PM