Share News

భృంగివాహనంపై శివపార్వతులు

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:33 AM

అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

భృంగివాహనంపై శివపార్వతులు

శైలపుత్రిగా దర్శనమిచ్చిన అమ్మవారు

శ్రీగిరిలో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు

శ్రీశైలం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమివ్వగా... ఆదిదంపతులు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి భృంగి వాహనంపై విహరించారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలోని యాగశాల ప్రవేశంతో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అనంతరం గణపతిపూజ, దీక్షాసంకల్పం నిర్వహించి, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన, నవగ్రహజపాలు, పారాయణలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి యాగశాలలో యాగశాలప్రవేశం, గణపతిపూజ, శివసంకల్పం తదితర వేడుకలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని వేదపండితులు, అర్చకులు సంకల్పాన్ని పఠించారు. దసరా మహోత్సవాల్లో భాగంగా కుమారిపూజలు నిర్వహించారు. ఈ కుమారి పూజలో భాగంగా రెండు సంత్సరాలు నుంచి పది సంవత్సరాలలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించారు.

శైలపుత్రిగా అమ్మవారి రూపం

తొలిరోజు భ్రమరాంబికా అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారు ద్విభుజాలను కలిగి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం భృంగివాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. రెండో రోజు మంగళవారం అమ్మవారు బ్రహ్మచారిని అలంకరణలో దర్శనమిస్తారు. సాయంత్రం మయూర వాహనంపై శివపార్వతులు విహరిస్తారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయ దక్షిణమాడ వీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. సాయంత్రం తిరుపతికి చెందిన అముదాల మురళి నిర్వహిం చిన దేవీ భాగవతం, ప్రకాశం జిల్లా టి.బాలయోగి బృందం ఆధ్వర్యంలో భక్తరంజని కార్యక్రమాలు అలరించాయి.

Updated Date - Sep 23 , 2025 | 12:33 AM