సీమ జలసిరి హంద్రీనీవా
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:39 PM
రాయలసీమ జలసిరి హంద్రీనీవా ప్రాజెక్టు అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
మంత్రి నిమ్మల రామానాయుడు
కర్నూలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జలసిరి హంద్రీనీవా ప్రాజెక్టు అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా ఆధ్వర్యంలో ఆయన చాంబర్‌లో ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుపై సమీక్షించారు. ప్రస్తుతం ఏఏ ప్రాజెక్టుల్లో ఎంత మోతాదులో నీటి నిల్వలున్నాయని, చేపట్టాల్సిన ప నులు తదితర వాటిపై చర్చించారు. సకాలంలో హంద్రీనీవా పరిధిలోని 517 చెరువులను నింపాలని ఇంజనీర్లకు సూచించారు. సకాలంలో హంద్రీనీవా విస్తరణ పనులు పూర్తి చేసిన ఇంజనీర్లను అభినందించారు. సీమకు గుండెకాయ లాంటి హంద్రీనీవా పనులపై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జలాశయాల్లో 961 టీఎంసీలు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.3,900 కోట్లతో విస్తరణ పనులు పూర్తి చేయడం వల్లే 733 కిలోమీటర్లు దూరంలోని కుప్పంకు కృష్ణా జలాలు తీసుకెళ్లామని గుర్తు చేశారు. సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ సలహాదారుడు వెంకటేశ్వరరావు ఈఎన్‌సీ నరసింహామూర్తి, సీఈలు కబీర్‌బాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.