గాడి తప్పిన సచివాలయాలు...!
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:26 PM
ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసింది.
పని వేళలు పాటించని ఉద్యోగులు
తనిఖీలు, పర్యవేక్షణ పట్టించుకోని ఉన్నతాధికారులు
సచివాలయాల చుట్టూ ప్రజల ప్రదక్షిణలు
జిల్లా పీజీఆర్‌ఎస్‌కు దరఖాస్తుల వెల్లువ
సమావేశాలు నిర్వహించని స్పెషల్ ఆఫీసర్లు, మండల ఆఫీసర్లు
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు కలెక్టర్ కార్యాలయానికి వెళుతున్నాయి. సచివాలయ స్థాయికి చెందిన సమస్యలు అక్కడ పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల్లో ప్రింటర్ పని చేయడం లేదని, కంప్యూటర్ పని చేయడం లేదని, ప్రింట్ ఇచ్చే సర్టిఫికెట్లు అయిపోయాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి మండలంలో 15 నుంచి 25 గ్రామాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా సచివాలయాలే కీలకం. కుల ఆదాయ సర్టిఫికెట్లు, జనన మరణ పత్రాల పనులు సచివాలయంలోనే జరగాలి. కానీ నేడు సచివాలయాలు అవినీతికి కేంద్ర బిందువుగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పొలం సబ్ డివిజన్, వన్‌బీ, అడంగల్, ఆర్‌వోఆర్ పొందాలంటే సచివాలయానికి వెళ్లాల్సిందే. గ్రామ, మండల, నగర మున్సిపాలిటీలలో పరిష్కారం కావాల్సిన అర్జీలు వేల కొద్ది సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలపై పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు కనీసం గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేస్తే కొంత వరకైనా పరిష్కారం లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీలను చేత పట్టుకుని మండల కేంద్రానికి, సచివాలయానికి అధికారులు తిప్పుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
సమయపాలన లేదు
ఉదయం 10 గంటలకే గ్రామ, వార్డు సచివాలయాల పని వేళలు ప్రారంభం కావాలి. కానీ ఉదయం 11.30 గంటల వరకు కూడా సచివాలయ అధికారులు విధులకు హాజరు కావడం లేదు. ప్రజలు సచివాలయాలకు వచ్చి వెళ్లిపోతున్నారు. ఉదయం 12 గంటలకు అధికారులు సచివాలయానికి వచ్చి అలా మొహం చూపించి వెళ్తున్నారు. ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే ఫీల్డ్‌లో ఉన్నామని, మండల ఆఫీసులో మీటింగ్ ఉందని, మరికొందరు కలెక్టరేట్‌లో పని ఉందని సమాధానం చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
మ్యాపింగ్‌లో లీలలు
గ్రామ, వార్డు సచివాలయాల్లో గత వైసీపీ ప్రభుత్వంలోని వలంటీర్లు ఇళ్లను మ్యాపింగ్ చేశారు. దీని వల్ల ఇప్పటికీ అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వలంటీర్లు డబ్బులు దండుకుని పింఛన్ మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎక్కువ పొలం ఉన్న రైతులకు ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారికి కూడా పింఛన్లు మంజూరు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న భూసర్వే తప్పుల తడకగా సాగడంతో రైతులు రైతులు ఇబ్బంది పడుతున్నారు.
తీవ్రంగా జాయింట్ ఎల్‌పీఎం సమస్య
జాయింట్ ఎల్‌పీఎంను సబ్ డివిజన్ చేయాలన్న గ్రామ సర్వేయర్‌కి రైతులు పైసలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓర్వకల్లు, కర్నూలు, కల్లూరు పరిధిలోని భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలంటే లక్షల్లో అధికారులు, ముడుపులు చెల్లించుకునే పరిస్థితి నెలకొంది. ఇంటి పన్ను నీటి పన్ను వసూలు చేయడంలో సచివాలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను డబ్బులు ఇచ్చినా రసీదు ఇవ్వడం లేదు. పన్నుల విషయంలో సచివాలయ అధికారులు ప్రచారం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
మొత్తం అర్జీలు 56,754
పరిష్కారం చూపినవి 50,028
పురోగతిలో ఉన్నవి 2,222
ఇంకా చూడని దరఖాస్తులు 29
పెండింగ్‌లో ఉన్నవి 1,264
సచివాలయాలను తనిఖీ చేస్తాం
జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఖచ్చితంగా తనిఖీ చేస్తాం. సచివాలయ అధికారులు పని వేళలు పాటించాలి. విధులకు హాజరు కాని వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు