బడిబాట
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:22 AM
పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కావడడంతో విద్యార్థులు బడిబాట పడుతున్నారు. 48 రోజుల నేసవి సెలవులు ముగిశాయి
విద్యార్థులకు సన్న బియ్యంతో పలావ్,గుడ్డు
హొళగుంద, దేవనకొండ పాఠశాలల్లో నిలిచిననీరు
ఆదోని అగ్రికల్చర్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కావడడంతో విద్యార్థులు బడిబాట పడుతున్నారు. 48 రోజుల నేసవి సెలవులు ముగిశాయి. దీంతో పాఠశాలల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి కనిపించింది. కాగా మొదటి రోజు కావడంతో విద్యార్థులు స్వల్ప సంఖ్యలో మాత్రమే వచ్చారు. పట్టణంలో 39కిపైగా పురపాలక పాఠశాలలు ఉన్నాయి. మొదటి రోజు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికి తమను పరిచయం చేసుకున్నారు.
అడ్మిషన్ల కోసం క్యూ
పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశా లలలో చేరెందుకు విద్యార్థులు, తల్లిదండ్రులతో క్యూ కట్టారు. ఆరో తరగతిలో ప్రవేశానికి బారీగా వచ్చారు. హెచ్‌ఎం పయాజుద్దీన్ విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరిశీలించి ప్రవేశాన్ని ఇచ్చారు.
సన్న బియ్యంతో పలావ్
ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సమూలమైన మార్పులు తెచ్చింది. అందులో భాగంగా మొదటి రోజు సన్న బియ్యంతో కోడిగుడ్డు కూరతో, వెజిటేబుల్ పలావ్‌ను వడ్డించారు. ఆహారం రుచికరంగా ఉందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
హొళగుంద: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. తరగతి గదుల ముందు వర్షపు నీరు ఉండటంతో ఇబ్బందులు ఎదురుకున్నారు. మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయని, ప్యాన్లు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై హెచ్‌ఎం కబీర్ సాబ్‌ను వివరణ కోరగా రెండు రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.
మద్దికెర: స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మొత్తం 350 మంది విద్యార్థులకు గానూ మొదటి రోజు గురువారం 16 మంది మాత్రమే వచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన వెంటనే పుస్తకాలు, బ్యాగు లు అందుబాటులో ఉంచారు. హెచ్‌ఎం మోహన్ మాట్లాడు తూ మొదటి రోజు కావడంతో విద్యార్థులు పాఠశాలకు రాలే దని, తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చామని తెలి పారు. సన్నబియ్యంతో భోజ నాన్ని వడ్డించారు. బీసీ హాస్టల్ లో 200 మంది విద్యార్థులుం డగా ఒక్కరూ రాలేదు. విద్యార్థులు లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు.
చెరువుగా మారిన పాఠశాల
దేవనకొండ: మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల ఆవరణ చెరువుగా మారింది. చిన్న వర్షం వస్తే చాలు చెరువులా మారుతుంది. పాఠశాలల అభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అవి నీళ్లపాలవుతున్నాయి.