బడులు బోసిపోతున్నాయ్..!
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:54 PM
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం కరువుతో నేటికీ విలవిలలాడుతోంది
వలస బాటలో విద్యార్థులు
తల్లిదండ్రులతో కలిసి పట్టణానికి పయనం
పాఠశాలలో తగ్గిన హాజరు శాతం
ఇలాగైతే అక్షరాస్యత మెరుగుపడేనా?
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం కరువుతో నేటికీ విలవిలలాడుతోంది. ఆరుగాలం కష్టపడే అన్నదాతలు నిత్యం ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడిపోతున్నారు. బతుకుదెరువు కోసం బండెడు దుఃఖాన్ని దిగమింగుకొని వలసబాట పడుతున్నారు. పిల్లాపాపలతో కలిసి పని కోసం పట్టణాలకు పయనమవుతున్నారు. పలకా బలపం పట్టి బడుల్లో ఉండాల్సిన చిన్నారులు పత్తి పొలాల్లో, మిరప తోటల్లో మగ్గిపోతున్నారు. జీవితం అంటే ఏమిటో తెలియని వయస్సులో పనులు చూస్తూ.. చదువుకు దూరమై.. బతుకు భారమై.. జీవన పోరాటం సాగిస్తున్నారు. కోసిగి మండలం నిరక్షరాస్యతలో ముందుండేది. అలాంటి చోటకు ప్రభుత్వం కొత్త పంతుళ్లను నియమించింది. అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేసింది. అయినా లాభం లేకుండా పోయింది. విద్యార్థులు వలసబాట పట్టడంతో సర్కారు స్కూళ్లు బోసిపోతున్నాయి.
కోసిగి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రాంతంలో వలసలు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రభుత్వ బడులను చూస్తే అర్థమవుతుంది. మండ లంలోని 6,200మందికి పైగా విద్యార్థులు తల్లి దండ్రులతో కలిసి వలసబాట పట్టారంటే పరిస్థి తులు ఎంత దయనీయంగా ఉన్నాయో తెలు స్తుంది. ప్రాథమిక పాఠశాలలు 33, జిల్లా పరిషత్ పాఠశాలలు 15, మొత్తం 48 ప్రభుత్వ పాఠశాలల్లో 16,175 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవలే ‘ఆంధ్రజ్యోతి’ ప్రభుత్వ పాఠశాలలను పరి శీలించగా 48పాఠశాలల్లో 9,780 మంది విద్యార్థులు హాజరయ్యారు. 6,395 మంది విద్యార్థులు తల్లిదం డ్రుల వెంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పోయారు. అక్షరాస్యతలో దేశంలోనే చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉన్న కోసిగిలో ఈ వలసల వల్ల అక్షరాస్యత మండలంలో పూర్తిగా హాజరు శాతం పడిపోతోంది.
కొత్త ఉపాధ్యాయులు వచ్చినా..
కోసిగి మండలానికి డీఎస్సీ ద్వారా 256మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించింది. వివిధ బడుల్లో వారు విధుల్లో చేరారు. కొత్త టీచర్లతో ప్రభుత్వ పాఠశా లలు కళకళలాడాయి. కొత్త ఉపాధ్యాయులు వచ్చారు గానీ, విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లడంతో తరగతి గదులు బోసిపోతున్నాయి.
వలసలను నివారించేందుకు కృషి చేయాలి
పశ్చిమ ప్రాంతం అంటేనే గుర్తు వచ్చేవి వలసలు. ఇప్పటికే ఆయా మండలాల నుంచి వేలాది మంది వలసబాట పట్టారు. వలసలను నివారించేందుకు జిల్లా అధికారులు దృష్టి పెట్టాల్సి అవసరం ఉంది. ముఖ్యంగా కోసిగి మండలంపై ప్రత్యేక దృష్టి సారించి వలసలను నివారించి చిన్నారులు బడిబాట పట్టేలా ప్రయత్నించాల్సి ఉంది. విద్యార్థులందరూ బడికి వెళ్లితే అక్షరాస్యత కూడా మెరుగు పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో..
బతుకుదెరువు వలస వెళ్తూ పెద్దలు.. తమ పిల్లలు ఇక్కడ ఉంటే పట్టించుకునే వారు ఉండరని, తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్తున్నామని చెబుతున్నారు. ఒకవేళ ఇక్కడే సరైన వసతి ఏర్పాట్లు విద్యార్థులు కల్పిస్తే పిల్లలను అక్కడి చేర్పించి తాము వలస వెళ్తాం. ఆ సౌకర్యాలు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వెంట తీసుకెళ్తున్నామని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల వలసలపై జిల్లా అధికారులకు తెలియజేశాం. ముందే సీజనల్ హాస్టల్స్ వచ్చి ఉంటే కొంత మేర విద్యార్థుల వలసలు తగ్గేవి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
బాలయ్య, ఎంఈవో, కోసిగి
గుండె చలించిపోతుంది
టీచర్లుగా నియామకమై పాఠశాలకు వచ్చినప్పుడు తరగతి గదుల నిండా విద్యార్థులు ఉండేవారు. వారం రోజుల వ్యవధిలో 60శాతం పైగా విద్యార్థులు వలస వెళ్లారు. తరగతి గదులు చూస్తే గుండె చలించిపోతుంది.
- అరివిలి అయ్యప్ప, హెచ్‌జీ పాఠశాల, కోసిగి