బడి బలోపేతం
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:24 AM
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించి, సంపూర్ణ అభివృద్ధిని సాధించడానికి కార్యక్ర మాన్ని రూపొందించారు.
10న పాఠశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్ల సమావేశం
ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు
ఆలూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించి, సంపూర్ణ అభివృద్ధిని సాధించడానికి కార్యక్ర మాన్ని రూపొందించారు. విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, విద్యార్థులు, పాఠశాలల మధ్య సంబంధాలను బలపరచడానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించింది. దీనిలో భాగం గానే జిల్లాలోని 1485 ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేం దుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం ఆయా పాఠశాలలు కంపోజిటివ్ గ్రాంట్ నుంచి 20 శాతం నిధులను ఖర్చు చేయాలని ఆదేశించింది. పది మంది పిల్లలు ఉన్న బడులకు రూ. వెయ్యి, 300 నుంచి 400 మంది పిల్లలు ఉన్న బడులకు రూ.5 వేలు, ఇలా సంఖ్యను బట్టి నిధులను కేటాయించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించ నున్నారు. వారం రోజులుగా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓకు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల కమిటీల సమావేశాలు కొత్త కానప్పటికీ ఈసారి మాత్రం పలు ప్రత్యేకతలు జోడించారు. పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు ఎవరి స్థాయిలో వారు నిధులు సేకరించి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ మార్గదర్శ కాల ప్రకారం ఆహ్వాన కమిటీ, బడ్జెట్ కమిటీ, బడి సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణ, రిసెప్షన్, సీటింగ్ ఏర్పాట్లు, విద్యార్థుల ప్రగతి నివేదికలు, స్టేజీ నిర్వహణ ఇలా పలు రకాల కమిటీలను ఏర్పాటు చేశారు.
పిల్లల ప్రగతిపై నివేదికలు
ప్రత్యేకంగా నిర్వహించే ఈ సమావేశంలో పిల్లల ప్రగతికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను తల్లిదండ్రులకు అందజేయనున్నారు. సమగ్ర శిక్ష అధికారులు సిద్ధం చేస్తున్న ఈ ప్రోగ్రెస్ కార్డుల్లో మార్కులు, హాజరుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర రంగాల్లో కనబరిచిన ప్రతిభ ఆరోగ్యపరంగా ఎత్తు, బరువు, వ్యాధి నిర్ధారణ పరీక్షల వివరాలు పొందుపరుస్తున్నారు. విద్యార్థులు ఇళ్లవద్ద సెల్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు అధికంగా వినియోగించకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు తల్లులకు రంగోలి, తండ్రు లకు టగ్ ఆఫ్ వార్, పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి కార్యక్రమం విజయవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఫొటో డ్రీమ్ వాల్స్, పాజిటివ్ పేరెటింగ్ సెషన్లు, అమ్మ పేరుతో మొక్క నాటడం, గ్రీన్ పాస్ పోర్ట్ కార్యక్రమా లు చేపడుతున్నారు. అలాగే ఆసక్తి కలిగిన విద్యార్థులు మొక్కలు సరఫరా చేయడానికి ముందస్తుగా పేర్లు నమోదుగా ప్రత్యేకంగా యాప్ అందుబాటులో ఉంచారు. మానసిక ఆరోగ్యం, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహణ
జిల్లాలో మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ జూలై 10వ తేదీన జిల్లాలో ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్నాం. కలెక్టర్ రంజిత్ బాషా పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమం లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తారు. ప్రస్తుతం చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తాం. జిల్లావ్యాప్తంగా తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు సూచనలు, సలహాలతో ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. శ్యామ్యూల్‌పాల్, డీఈవో, కర్నూలు