Share News

మళ్లీ అదేకథ..!

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:20 PM

తుంగభద్ర, హంద్రీ నదుల్లో నాగులదిన్నె, గంగవరం, ముద్దటమాగి ఓపన్‌ రీచుల్లో ఇసుక లోడింగ్‌ టెండర్లు పిలిచారు.

మళ్లీ అదేకథ..!
హొళగుంద మండలం మద్దుటమాగి గ్రామం వద్ద వేదావతి నదిలో ఇసుక తవ్వకాలు (ఫైల్‌)

ఇసుక లోడింగ్‌ టెండర్లు రద్దు..

తుంగభద్ర, హగరి నదుల్లో నాగులదిన్నె, గంగవరం, ముద్దటమాగి రీచ్‌లు

3.45 లక్షల టన్నులు లభ్యత

టన్ను లోడింగ్‌ చార్జ్‌ రూ.0.98 పైసలకు టెండరు

రద్దు చేసి రెండోసారి టెండర్లు

రూ.31లకు కోడ్‌ చేసినా.. రద్దు చేసిన కమిటీ

కోర్టు వెళ్లే యోచనలో కాంట్రాక్టర్లు

తుంగభద్ర, హంద్రీ నదుల్లో నాగులదిన్నె, గంగవరం, ముద్దటమాగి ఓపన్‌ రీచుల్లో ఇసుక లోడింగ్‌ టెండర్లు పిలిచారు. టన్ను ఇసుక లోడింగ్‌కు రూ.48 ధర నిర్ణయించి టెండర్లు పిలిస్తే రూ.0.98 పైసలు కోడ్‌ చేశారు. ఆ టెండర్లు రద్దు చేసి నిర్ణయించిన ధర కంటే రూ.30కు తగ్గకుండా తక్కువ ధరకు కోడ్‌ చేస్తారో వారికే కాంట్రాక్టు ఇస్తామంటూ రెండో దఫా టెండర్లు పిలిచారు. మూడు రీచ్‌లకు 32 మంది కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేసినా అందరు ఒకే రేటు రూ.31 కోడ్‌ చేయడంతో మళ్లీ రద్దు చేశారు. అయితే రాజకీయ ఒత్తిడి వల్లే రద్దు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడోసారి టెండర్లు పిలిచేందుకు జిల్లా శాండ్‌ కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) సన్నాహాలు చేస్తోంది. అయితే గనులు, భూగర్భ వనరుల శాఖ నిబంధనల మేరకే టెండర్లు వేశాం.. లేనిపోని కారణాలతో టెండర్లు రద్దు చేస్తే కోర్టును ఆశ్రయించక తప్పదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.

కర్నూలు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు, రవాణా కోసం గనులు భూగర్భవనరులు, జలవనరులు, రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేసి కౌతాళం మండలం గుడికంబాలి-1, 2 మరళి-1లో ఓపన్‌ రీచ్‌లు, సి.బెళగల్‌ మండలం కొత్తకోట, కె.సింగవరం, పల్లెదొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె గ్రామాల దగ్గర నాలుగు డీసిల్టేషన్‌(నీటిలో బోటు ద్వారా ఇసుక తవ్వకాలు) రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా తుంగభద్ర నదిలో నందవరం మండలం నాగులదిన్నె, గంగవరం, వేదవతి నదిలో హొళగుంద మండలం ముద్దటమాగి ఇసుక రీచ్‌ల్లో 3.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక లభ్యత ఉందని అంచనా వేశారు. ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న లబ్ధిదారులు తీసుకొచ్చే టిప్పర్లు, ట్రాక్టర్లకు రీచ్‌లో ఇసుక లోడింగ్‌ చేసేందుకు ఒక మెట్రిక్‌ టన్ను లోడింగ్‌కు రూ.45 ధర నిర్ణయించారు. నందవరం మండలం నాగులదిన్నె రీచ్‌లో 1.20 మెట్రిక్‌ టన్నులు, గంగవనం రీచ్‌లో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు, ముద్దటమాగి రీచ్‌లో 75 వేలు మెట్రిక్‌ టన్నులు ఇసుక కలిపి మూడు రీచ్‌లో 3.45 లక్షల మెట్రిక్‌ టన్నులు లోడింగ్‌ చేయడానికి లోడింగ్‌ కాంట్రాక్ట్‌ విలువ సుమారుగా రూ.1.55 కోట్లు ఉంటుదని అంచనా వేశారు. మెట్రిక్‌ టన్ను లోడింగ్‌ చార్జీ రూ.48కు అక్టోబరు నెలలో టెండర్ల పిలిస్తే.. నాగులదిన్నె రీచ్‌లో రూ.6, గంగవరం రీచ్‌లో రూ.0.98 పైసలు, ముద్దటమాగి రీచ్‌లో రూ.6.90 కోడ్‌ చేశారు. జిల్లా శాండ్‌ కమిటీ రూ.48 ధర నిర్ణయిస్తే అత్యల్పంగా రూ.0.98 పైసలకే లోడింగ్‌ చేస్తామని టెండరు వేశారు. 18 టన్నుల టిప్పర్‌కు రూ.17.64కే లోడింగ్‌ చేయడం ఎలా సాధ్యం..? దీంతో ఆ టెండర్లు రద్దు చేసి రెండోసారి టెండర్లు పిలిచారు.

ఈ టెండర్లు కూడా రద్దు

రెండవ పర్యాయం టెండర్లు పిలుస్తూ.. కనీసం రూ.30కు తగ్గకుండా నిర్ణయించిన టన్ను ఇసుక లోడింగ్‌ ధర రూ.48 కంటే తక్కువకు టెండరు కోడ్‌ చేసిన వారికే నిబంధనల మేరకు ధ్రువపత్రాలు పరిశీలించి లోడింగ్‌ కాంట్రాక్ట్‌ ఇస్తామని షరతు పెట్టారు. ఎక్కువ మంది ఒకే ధర కోడ్‌ చేస్తే లాటరీ ద్వారా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తామని అన్నారు. గంగవరం రీచ్‌కు 11, నాగులదిన్నె రీచ్‌కు 14, ముద్దటమాగి రీచ్‌కు 7 టెండర్లు షెడ్యూళ్లు కాంట్రాక్టర్లు దాఖలు చేశారు. 32 మంది కాంట్రాక్టర్లు కూడా కనీస ధర రూ.30పై ఒక రూపాయి పెంచి రూ.31 కోడ్‌ చేశారని మైనింగ్‌ అధికారులు పేర్కొన్నారు. దీంతో జిల్లా శాండ్‌ కమిటీ పర్యవేక్షణలో లాటరీ నిర్వహిస్తే.. గంగవరం, నాగులదిన్నె రీచ్‌లు కర్నూలు నగరానికి చెందిన శివారెడ్డి అనే కాంట్రాక్టర్‌కు, ముద్దటమాగి రీచ్‌ కర్ణాటకకు చెందిన టీవీఎస్‌ అసోసియేట్స్‌ అనే సంస్థకు దక్కింది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్లతో గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు ఒప్పందం (అగ్రిమెంట్‌) చేసుకొని రీచ్‌లు అప్పగించాల్సి ఉంది. అయితే.. కాంట్రాక్టర్లందరూ రూ.31 ఒకే ధర టెండరు కోడ్‌ చేయడంతో.. సిండికేట్‌గా ఏర్పడి ఇలా వ్యవహరించారని భావించిన జిల్లా శాండ్‌ కమిటీ మళ్లీ టెండర్లను రద్దు చేసింది.

రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?

రెండోసారి కూడా ఇసుక లోడింగ్‌ టెండర్లు రద్దు చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఉచిత ఇసుక విషయంలో కూటమి నాయకులు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లతో టెండర్లు రద్దు చేయడం విమర్శలకు తావిస్తోంది. అయితే పక్కా నిబంధనల ప్రకారమే రెండోసారి టెండర్లు పిలిచారని, ఆ మేరకే టెండర్లు వేస్తే ఇప్పుడు రద్దు చేయడం వెనుక ఆంతర్యమేమిటీ..? అని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ఓ కాంట్రాక్టరు పేర్కొనడం కొసమెరుపు. ఈ విషయాన్ని గనులు భూగర్భ వనరుల శాఖ డీడీ జి.వెంకటేశ్వర్లు దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకువెళ్లగా ఇసుక లోడింగ్‌ టెండరులో కాంట్రాక్టర్లు అందరు కూడా ఒకే రేటు కోడ్‌ చేయడంతో రద్దు చేసిన మాట నిజమే అన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 11:20 PM