Share News

కుంగిన ఎస్‌ఎస్‌ ట్యాంకు పలకలు

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:06 AM

: పట్టణ ప్రజలకు తాగునీరు అందించే బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ గట్టు కాంక్రీట్‌ పలకలు బుధవారం తెల్లవారుజామున వంద మీటర్ల మేర కుంగిపోయాయి. వారం రోజుల్లో ఎల్‌ఎల్‌సీ కాలుకు నీరు విడుదలయ్యే సమయంలో ఇలా కావడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.

కుంగిన ఎస్‌ఎస్‌ ట్యాంకు పలకలు
కుంగిపోయిన బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంకు గట్టు సీసీ పలకలు

మరమ్మతులకు అనుకూలించని వాతావరణం

ట్యాంకును పూర్తిగా నింపుకునే అవకాశం లేనట్లే

ఆదోని టౌన్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలకు తాగునీరు అందించే బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ గట్టు కాంక్రీట్‌ పలకలు బుధవారం తెల్లవారుజామున వంద మీటర్ల మేర కుంగిపోయాయి. వారం రోజుల్లో ఎల్‌ఎల్‌సీ కాలుకు నీరు విడుదలయ్యే సమయంలో ఇలా కావడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. విషయాన్ని కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే 115 మీటర్ల మేర కుంగిపోయే భారీ వర్షాలు కురిస్తే మరింతగా దిగజారే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రెండు సార్లు..

బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంకును రూ.38 కోట్లతో నిర్మించగా 2007లో అందుబాటులోకి వచ్చింది. అయితే 2020లోనే గట్టుకు ఉన్న సీసీ పలకలు మొదటిసారి జారిపోయాయి. అనంతరం 2023లో రెండోసారి కూడా పలకలు జారిపోవడంతో తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. ప్రస్తుతం మూడోసారి కూడా కుంగిపోవడంతో చెరువు గట్టు భధ్రతపై ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఎల్‌ఎల్‌సీ నీటి పంపింగ్‌ పై ఆందోళన

నాలుగైదు రోజుల్ల ఎల్‌ఎల్‌సీకి నీరు విడుదల చేసే అవకాశం ఉండంతో తాగునీటి విడుదల జరగనుంది. 3110 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ చెరువును ఇప్పటి పరిస్థితిలో 30 శాతం మాత్రమే నింపుకొనే అవకాశం ఉందని అధికారుల తేల్చారు. ఈ నీరు 15 రోజులకు మాత్రమే సరిపోయే అవకాశం ఉండటంతో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శాశ్వత మరమ్మతులకు ప్రతిపాదనలు

చెరువుకు శాశ్వత మరమ్మత్తుల కోసం రూ. 47 కోట్లతో ప్రతిపాదనలను పంపాం. పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ చెరువును పరిశీలించడానికి వస్తున్నారు. వారి సూచనల మేరకు చర్యలు తీసుకొంటాం. - కృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌

Updated Date - Jul 03 , 2025 | 01:06 AM