క్రీడాభివృద్ధిని అడ్డుకోవడం దారుణం
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:50 AM
క్రీడాభివృద్ధిని అడ్డుకోవడం దారుణమని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రశేఖర్, విద్యార్థులు వాపోయారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్, విద్యార్థులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు
ప్రిన్సిపాల్‌పై ఫిజికల్ డైరెక్టర్, విద్యార్థుల ఆగ్రహం
డోన్ టౌన్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): క్రీడాభివృద్ధిని అడ్డుకోవడం దారుణమని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రశేఖర్, విద్యార్థులు వాపోయారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్, విద్యార్థులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పీడీ చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం క్రీడా మైదానం ఎంతో అధ్వానంగా ఉండేదని, స్థానికులు, ప్రముఖులు తమ సొంత నిధులతో పాటు స్థానికుల సహకారంతో గ్రౌండును ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కళాశాలలో జరుగుతున్న అభివృద్ధికి తమకు అండగా నిలవాల్సిన ప్రిన్సిపాలే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బెంచీలను కూడా ధ్వంసం చేశారని మండిపడ్డారు. కళాశాల విద్యార్థులను, స్థానికులను గ్రౌండులోకి రానీయకుండా గేటుకు తాళాలు వేయడంతో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. కళాశాల అభివృద్ధి చేయాల్సిన పనిలేదని, జీతం తీసుకుని ఉద్యోగం మాత్రమే పని చేయాలంటున్న ప్రిన్సిపాల్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ప్రిన్సిపాల్ వైఖరితో దాతలు కూడా బాధపడుతున్నారని, ఆయన వైఖరిపై ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో చేరకముందు అనేక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రిన్సిపాల్ ఏళ్లు గడుస్తున్నా సౌకర్యాలు కల్పించకపోవడమే కాకుండా కళాశాలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. సమావేశంలో విద్యార్థులు పాల్గొన్నారు.