Share News

ప్రగతిలో పరుగు

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:20 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు అమరావతి సచివాలయంలో గురువారం రెండో రోజు జరిగింది.

ప్రగతిలో పరుగు

కర్నూలు జిల్లాలో 34, నంద్యాల జిల్లాలో 8 పరిశ్రమలకు ఆమోదం

36 వేల ఉద్యోగాల కల్పన

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ రాబడిలో పురోగతి

మున్సిపాలిటీలకు ఆర్థిక భరోసా ఎల్‌ఆర్‌ఎస్‌

కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

కర్నూలు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు అమరావతి సచివాలయంలో గురువారం రెండో రోజు జరిగింది. ఈ సదస్సుకు కర్నూలు, నంద్యాల జిల్లాల మంత్రులు టీజీ భరత్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్లు డాక్టర్‌ అట్టాడ సిరి, రాజకుమారి, ఎస్పీలు విక్రాంత్‌ పాటిల్‌, సునీల్‌ షెరాన్‌ హాజరయ్యారు. వివిధ శాఖల్లో సాధించిన పురోగతిపై చర్చించారు. సాధించాల్సిన లక్ష్యాలపై దిశానిర్ధేశం చేశారు. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ల సదస్సులోనూ ఈ రెండు జిల్లాలపై ఆసక్తిగా సమీక్ష చేశారు. పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ఆశయంగా కూట మి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అందుకు తగ్గట్టుగా కలెక్టర్లు, అధికారులు పనిచేయాలని చంద్రబాబు సూచించారు. 18నెలల్లో కర్నూలు జిల్లాలో 34, నంద్యాల జిల్లాలో 8పరిశ్రమలకు ఎంవోయూ, మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వాటి ద్వారా 36వేల మంది యువతకు ఉద్యోగాల వస్తాయన్నారు. జాబ్‌ మేళ కార్యక్రమాలు ద్వారా మరింత మంది యువతకు ఉపాధి చూపాలని సూచించారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ రాబడి గణనీయంగా వృద్ధి సాధించింది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న నగరపాలక, పురపాలక సంఘాలకు లే-అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఆర్థికంగా అండగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ, ఇతర పన్నులు రాబడి వృద్ధి సాధించింది. వివిధ అంశాలపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

యువత, ఉపాధికి ప్రాధాన్యం

సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం 18 నెలల్లో పరిశ్రమలు ఏర్పాటుకు పెద్దపీట వేసింది. కర్నూలు జిల్లాలో 15 పరిశ్రములు ఎంవోయూ చేసుకున్నాయి. 19 పరిశ్రమలు మంత్రివర్గం అమోదం పొందాయి. 34 పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.71 వేల కోట్ల పెట్టుబడులు, 32 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. నంద్యాల జిల్లాలో 8 పరిశ్రమలు ఎంవోయూ, మంత్రివర్గం ఆమోదం పొందాయి. వీటి ద్వారా రూ.7 వేల కోట్లు పెట్టుబడులు, నాలుగు వేల మందికి ఉద్యోగ, ఉపాధి లభించనుంది. 2024 జూన్‌ నుంచి నవంబరు వరకు పరిశ్రమలు, గనులు భూగర్భ వనరులు, ఎన్‌ఆర్‌డీసీఏపీ, పర్యాటక రంగం విభాగాల్లో కర్నూలు జిల్లాలో 3,515, నంద్యా జిల్లాలో 12,804 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కర్నూలు జిల్లాలో 78 జాబ్‌ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తే 372 కంపెనీలు హాజరై 4,275 మంది ఉద్యోగాలు ఇచ్చాయి. నంద్యాల జిల్లాలో 62 జాబ్‌ మేళాలు నిర్వహిస్తే 386 కంపెనీలు హాజరై 4,276 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వ నివేదిక ద్వారా తెలుస్తోంది.

పురపాలక ఆదాయం భేష్‌

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అనధికారిక లే-అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) నగరపాలక, మున్సిపాలిటీలకు ఆదాయ వనరుగా నిలిచింది. ఈ పథకం ద్వారా కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో 5,897 దరఖాస్తులు స్వీకరించి రూ.20.87 కోట్లు నిధులు సమకూర్చుకున్నారు. అదే నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆత్మకూరు, డోన్‌, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె మున్సిపాలిటీల్లో 723 దరఖాస్తులు రాగా రూ.2.53 కోట్లు ఆదాయం వచ్చింది. అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్‌) కింద కర్నూలు జిల్లాలో 1162 అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే క్రమబద్దీకరణకు 129 దరఖాస్తులు రాగా వారి నంచి రూ.12.9 లక్షలు ప్యానెల్‌ అమౌంట్‌ వచ్చింది. నంద్యాల జిల్లాలో 871 అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే.. క్రమబద్ధీకరణకు 60 వచ్చాయి. వాటి నుంచి ప్యానెల్‌ అమౌంట్‌ రూ.10.22 లక్షలు సమకూరింది.

రిజిస్ట్రేషన్‌ రాబడిలో వృద్ధి

ఉమ్మడి జిల్లాల్లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం రాబడిలో గణనీమైన వృద్ధిని సాధించింది. వివిధ రిజిస్ట్రేషనల ఫీజులు, స్టాంప్‌ డ్యూటీ ద్వారా 2024 ఏప్రిల్‌ నుంచి నవంబరు 30 వరకు కర్నూలు జిల్లా రూ.146.04 కోట్లు రాబడి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు 30 వరకు రూ.197.52 కోట్లు రాబడి లక్ష్యం కాగా రూ.235.26 కోట్లు రాబట్టి 61.09 శాతం వృద్ధి రేటు సాధించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా గతేడాది రూ.71.98 కోట్లు రాబడితే, ఈ ఏడాది రూ.100.13 కోట్లు టార్గెట్‌ ఇస్తే నవంబరు 30 వరకు రూ.134.05 కోట్లు రాబట్టి 86.24 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకొని రాష్ట్రంలో నంబరు వన్‌ స్థానంలో నిలిచింది.

ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు,

పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలు

వివరాలు కర్నూలు నంద్యాల

ఫ ఎంవోయూ:

పరిశ్రమలు 15 4

పెట్టుబడులు (రూ.కోట్లు) 21,000 --

ఉద్యోగాలు 11,000 1,000

ఫ మంత్రివర్గం ఆమోదం:

పరిశ్రమలు 19 4

పెట్టుబడులు (రూ.కోట్లు) 50,000 7,000

ఉద్యోగాలు 21,000 3,000

ఫ మొత్తం:

పరిశ్రమలు 34 8

పెట్టుబడులు (రూ.కోట్లు) 71,000 7,000

ఉద్యోగాలు 32,000 4,000

2024 జూన్‌ నుంచి వివిధ

రంగాల్లో కల్పించిన ఉద్యోగాలు

రంగం కర్నూలు నంద్యాల

పరిశ్రమలు 1,873 476

మైనింగ్‌ శాఖ 157 181

ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ 1,415 11,876

పర్యాటక రంగం 70 --

మొత్తం 3,515 12,804

పెరిగిన జీఎస్టీ ఆదాయం

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జీఎస్టీ సహా వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కర్నూలు జిల్లాలో జీఎస్టీ, వివిధ పన్నుల ద్వారా రూ.432.41 కోట్లు ఆదాయం వస్తే 2025-26 నవంబరు వరకు రూ.525.63 కోట్లు రాబట్టి 21.56 శాతం వృద్ధి రేటు నమోదైంది. నంద్యాల జిల్లా గతేడాది రూ.178.55 కోట్లు రాబడితే ఈ ఏడాది నవంబరు వరకు 187.01 కోట్లు ఆదాయం సమకూర్చి 4.73 శాతం పెరిగింది. కేవలం నవంబరు నెలలో ఒక్కటే కర్నూలు జిల్లా గతేడాది రూ.70.28 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.73.94 కోట్లు రాబట్టి 5.19 శాతం పెరుగుదల సాధించింది. నంద్యాల జిల్లాలో రూ.23.70 కోట్లు రాబడితే ఈ ఏడాది రూ.16.51 కోట్లు మాత్రమే రాబట్టి 30.33 శాతం లోటును నమోదు చేసుకోవడం గమనార్హం.

ప్రభుత్వ పథకాల అమలు ఇలా..

కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు అమలు ఫర్వాలేదు అనిపిస్తోంది. పీఎం విశ్వకర్మ పథకం కింద కర్నూలు జిల్లాలో 14,759 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యం కాగా 14,279 మంది ప్రయోజనం చేకూర్చారు. నంద్యాల జిల్లాలో 3,997 మందికి గానూ 3,934 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చారు. పీఎంకేఈవై కింద కర్నూలు జిల్లాలో 780, నంద్యాల జిల్లాలో 660 మంది లబ్ధిదారులకు చేయూత అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. వివిధ పథకాల అమలు తీరు ఫర్వాలేదని కలెక్టర్ల సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

పీ-4లో నంద్యాల టాప్‌

పీ-4, బంగారు కుటుంబాల ఎంపికలో నంద్యాల జిల్లా టాప్‌లో నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేయగా 35,171 మందిని దత్తత తీసుకున్నారు. జీఎ్‌సడబ్ల్యూసీతో అనుబంధం పెంచుకున్న బంగారు కుటుంబాలు 3.24 శాతంతో నంద్యాలో మొదటి స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో 31,399 మందిని దత్తత తీసుకున్నారు. 0.08 శాతంతో కర్నూలు జిల్లా 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తగ్గిన మద్యం కేసులు

కూటమి ప్రభుత్వం మద్యం పాలసీలో తీసుకువచ్చిన మార్పులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం కేసులు భారీగా తగ్గాయి. గత ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు 1,363 కేసులు నమోదైతే ఈ ఏడాది 414 కేసులకు పడిపోయింది. నంద్యాల జిల్లాలో గతేడాది 67 కేసులు నమోదైతే ఈ ఏడాది కేవలం 10 కేసులు మాత్రమే నమోదు కావడం కొసమెరుపు. 2023 అక్టోబరు నుంచి 2024 నవంబరు వరకు కర్నూలు జిల్లాలో 34,565 లీటర్లు అక్రమ మద్యం (ఎడీపీఎల్‌) సీజ్‌ చేస్తే, ఈ ఏడాది 10,604 లీటర్లు సీజ్‌ చేశారు. గతంలో పోలిస్తే 69 శాతం తగ్గింది.

మైనింగ్‌ శాఖ జీవీఏ లక్ష్యం

గనులు, భూగర్భ వనరుల శాఖ జీవీఏ సాధన లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కర్నూలు జిల్లాలో రూ.1,058 కోట్లు, నంద్యాల జిల్లా రూ.757 కోట్లు లక్ష్యం పెట్టుకున్నారు. ఈ శాఖ పనితీరులో నంద్యాల జిల్లా ఏ క్యాటగిరి, కర్నూలు జిల్లా బీ క్యాటగిరిలో ఉన్నాయి. మేజర్‌ మినరల్‌ లీజు ఎన్‌ఓసీల కోసం కర్నూలు జిల్లాలో 25 దరఖాస్తులు వస్తే ఆరుగురికి ఎన్‌ఓసీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో 11కు గానూ 9 జారీ చేశారు. రెండు జిల్లాలో సంతృప్తి శాతం 67-69 శాతం నమోదు చేసుకుంది. పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల శాఖ పనితీరుపై కూడా కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా చర్చించారు. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల కనెక్టివిటీపై చర్చించినట్లు తెలిసింది.

సంక్షేమ హాస్టళ్లను పెంచాలి

జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు వలసలు వెళ్లడం వల్ల చదువులు మధ్యలో ఆగిపోతున్నాయి. దీంతో అదనంగా సంక్షేమ హాస్టళ్లను మంజూరు చేయాలి. దీనిపై కలెక్టర్ల సదస్సులో మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. అదే క్రమంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని సీఎం చంద్రబాబుకు వివరించడం జరిగింది. రాయలసీమ జిల్లాలను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చే దిశగా ముందుకు సాగాలని దిశానిర్ధేశం చేశారు. ప్రధానంగా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ సమిష్టిగా జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

- డాక్టర్‌ ఏ.సిరి, కలెక్టర్‌, కర్నూలు

Updated Date - Dec 19 , 2025 | 12:20 AM