శిథిలం.. రబ్బర్ సీల్స్..!
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:56 PM
శిథిలం.. రబ్బర్ సీల్స్..!
సుంకేసుల గేట్ల నుంచి రోజుకు 100-150 క్యూసెక్కులు లీకేజీ
కర్నూలు నగరానికి వేసవి తాగునీటి కష్టాలు తప్పవు
మరమ్మతులకు రూ.40 లక్షలు
నీటి నిల్వతో రిపేరీ అసాధ్యం అంటున్న నిపుణులు
సుంకేసుల డ్యాం రేడియల్ గేట్స్ రబ్బరు సీల్స్ శిథిలావస్థకు చేరాయి. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు. 100 - 150 క్యూసెక్కులు లీకేజీలు అవుతున్నాయి. ప్రాణ జలమైన తుంగభద్ర జలాలు కడలిపాలు అవుతున్నాయి. గేట్ల మరమ్మతుల కోసం ప్రభుత్వంరూ.40 లక్షలు మంజూరు చేసింది. కాంట్రాక్టరుతో ఒప్పందం కూడా చేసుకున్నారు. కర్నూలు ప్రజల తాగునీటి అవసరాల కోసం పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడంతో రబ్బరు సీల్స్ మరమ్మతులు చేయడం కష్టంగా మారిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. మరమ్మతులు చేయకపోతే రాబోయే వేసవిలో నగరానికి తాగునీటి కష్టాలు తప్పవని అంటున్నారు.
కర్నూలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) రాయలసీమ జిల్లాల్లో అతిప్రాచీనమైన సుంకేసుల బ్యారేజీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర-పెన్నా నదులను అనుసంధానం చేస్తూ నావిగేషన్ (జల రవాణా) లక్ష్యంగా కర్నూలు రూరల్ మండలం సుంకేసుల గ్రామం సమీపంలో తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ, అనుసంధానంగా కేసీ కాలువ నిర్మాణం 1861లో చేపట్టి 1863-1870 మధ్య పూర్తి చేశారు. భారతదేశంలోనే తొలి ట్రాన్స్-బేసిన్ రవాణా ప్రాజెక్టు ఇది. 165 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కాలువకు ‘ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడం (వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రర్చర్)గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పాలకుల నిర్లక్ష్యం, కర్నూలు నగరానికి తాగునీటి ప్రత్యామ్నాయ వనరులు లేకపోవడం, అత్యాధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా మరమ్మతులు చేయడంలో అలసత్వం.. వెరసి సుంకేసులు బ్యారేజీ భద్రత ప్రశ్నార్థకంగా మారబోతోంది. 15 ఏళ్లకు పైగా శిథిలమైన రబ్బరు సీల్స్ మరమ్మతులు చేయకపోవడంతో తుంగభద్ర జలాలు వృథాగా పోతున్నాయి.
రూ.40 లక్షలు మంజూరు చేసినా..
గేట్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఎస్వీ ఇంజనీరింగ్ సంస్థ టెండర్లు దక్కించుకొని ఒప్పందం కూడా చేసుకుంది. మరమ్మతులు చేయాలంటే ప్రస్తుతం వరద కొనసాగుతోంది. ఆ తరువాతైనా చేద్దామంటే కర్నూలు నగరం తాగునీటి అవసరాల కోసం 1.2 టీఎంసీలు 365 రోజుల కోసం నీరు నిల్వ ఉంటుండడంతో గేట్లు మరమ్మతులు ప్రశ్నార్థకంగా మారింది. ఒక ఏడాదైనా తాగునీటి కోసం ప్రత్యామ్నాయం చేసుకుంటే డ్యాం గేట్లు శాశ్వత మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని, ఆ దిశగా ఆలోచించాలని నగరపాలక సంస్థ అధికారులకు 41 లేఖలు రాసినా స్పందన లేదని జలవనరుల శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కర్నూలు కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులు చర్చించి గేట్ల మరమ్మతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నాడు.. నేడు నిర్లక్ష్యమే..
తుంగభద్రకు 2009లో 9లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో, ఆ వరద ఉధృతికి సుంకేసుల బ్యారేజీ మట్టి ఆనకట్ట కొట్టుకుపోయింది. ప్రాజెక్టు సహా కేసీ కాలువ ఛిద్రమైంది. ఆ రోజు నుంచి తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకొట్టుస్తున్నారే తప్పా శాశ్వత మరమ్మతులపై దృష్టి సారించలేదు. ప్రాజెక్టుకు 30 రేడియల్ గేట్లు ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తకుండా 30 నంబరు గేటుకు స్టాప్‌లాక్ పెట్టి శాశ్వతంగా మూసివేశారు. వరద సమయాల్లో 29 గేట్లను ఎత్తడం, దించడం (ఆపరేషన్) చేస్తున్నారు. 2009 వరదకు గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 14 గేట్లు మరమ్మతులు చేశారు. 15 గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. రబ్బరు సీల్స్ శిథిలమవ్వడంతో గేట్లన్నీ మూసేసినా గేట్ల రబ్బరు సీల్స్ సందుల మధ్య నుంచి 100-150 క్యూసెక్కులు ప్రాణ జలాలు వృథాగా దిగువకు వదిలేయాల్సిన వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు.. విభజిత రాష్ట్రంలోనూ నాడు వైసీపీ.. నేడు కూటమి ప్రభుత్వాలు గేట్ల మరమ్మతులపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తుంది.
కర్నూలు నగరానికి తాగునీటి ముప్పు
కర్నూలు నగర ప్రజల ప్రధాన తాగునీటి ఆధారం సుంకేసుల బ్యారేజీ. దీని సామర్థ్యం 1.20 టీఎంసీలే. ఆరు లక్షలకు పైగా జనాభా కలిగిన నగరవాసుల దాహం, అవసరాలు, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు దాదాపుగా నాలుగు టీఎంసీలు నీరు అవసరం ఉందని అంచనా. సుంకేసుల బ్యారేజీ నుంచి రోజుకు 159 క్యూసెక్కులు డ్రా చేస్తున్నారు. నగర ప్రజలకు సరిపడ నీటి నిల్వ కోసం ఎస్‌ఎస్ ట్యాంక్ లేకపోవడంతో సుంకేసుల జలాశయమే ఎస్‌ఎస్ ట్యాంక్‌గా మార్చుకున్నారు. ఫలితంగా ఏడాదిలో 365 రోజులు నీటిని నిల్వ చేయాల్సి ఉంది. తుంగభద్రకు అక్టోబరు, నవంబరు తరువాత వరదలు ఉండవు. జూలై వరకు సుంకేసుల డ్యాంలో నిల్వ చేసిన నీరే ఆధారం. గేట్ల రబ్బరు సీల్స్ శిథిలం కావడంతో 100-150 క్యూసెక్కులు వృథాగా వెళ్తున్నాయని, తాగునీటి కోసం మరో 150 క్యూసెక్కులు డ్రా చేస్తున్నారని ఇంజనీర్లు చెబుతున్నారు. రబ్బరు సీల్స్ మరమ్మతులు చేయకపోతే డ్యాం ఖాళీ అయిపోయి వేసవిలో నీటి కష్టాలు తప్పవని అంటున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి కేసీ నీటి వాటా తీసుకుందామనుకున్నా, ఈ ఏడాది గేట్లు మరమ్మతు పనులు చేపట్లనుండడంతో రబీకి సాగు, తాగునీరు ఉండకపోవచ్చు, ప్రత్యామ్నాయం చూసుకోమని ఇప్పటికే టీబీపీ బోర్డు అధికారులు జిల్లా అధికారులను హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సుంకేసుల బ్యారేజీ గేట్ల రబ్బరు సీల్స్ సకాలంలో మరమ్మతులు చేపట్టకపోతే రాబోయే వేసవిలో నగరానికి నీటి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.