కొడుకుతో కలసి రోడ్డుపై అక్రమ వసూళ్లు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:17 AM
ఆయనో రిటైర్డ్ సీటీవో (కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్). ఉన్నతమైన ఉద్యోగం చేసి సంతోషంగా ఉండాల్సిన ఆయనకు ఇంకా డబ్బుపై ఆశ పోలేదు. ఉద్యోగ సమ యంలో అలవాటు కాబోలు పదవీవిరమణ పొందినా రోడ్డుపై నిలబడి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు
కేసు నమోదు చేసిన ప్యాపిలి పోలీసులు
రిటైర్డ్ సీటీవో చేతివాటం
ప్యాపిలి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఆయనో రిటైర్డ్ సీటీవో (కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్). ఉన్నతమైన ఉద్యోగం చేసి సంతోషంగా ఉండాల్సిన ఆయనకు ఇంకా డబ్బుపై ఆశ పోలేదు. ఉద్యోగ సమ యంలో అలవాటు కాబోలు పదవీవిరమణ పొందినా రోడ్డుపై నిలబడి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. అది కూడా కుమారుడితో కలసి చేతివాటం ప్రదర్శిం చడం గమనార్హం. అక్రమ వసూళ్ల సమాచారం తెలు సుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంఽ దించిన వివరాలు ఇలా... కర్నూలుకు చెందిన సుబ్బరా యుడు కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పనిచేస్తూ గత ఏడాది రిటైర్డ్ అయ్యాడు. అయితే సదరు అధికారి రిటైర్డ్ అయినా అక్రమ వసూళ్లను ఆపలేదు. కొన్ని నెలలుగా తన కొడుకు సురేష్‌తో కలసి డోన్, ప్యాపిలి, వెల్దుర్తి హైవేపై వాహనాలను ఆపి తాను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడు తున్నాడు. ప్రభుత్వ అధికారులు ఉపయోగించే అంబాసిడర్ కారులో వెళ్లి తన వద్ద ఉన్న పాత ఐడీ కార్డులతో దోపిడికి తెరలేపాడు. వారంలో ఒక్కోరోజు ఓ ప్రాంతంలోని హైవేపై ఈ వసూళ్లకు పాల్పడు తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు పట్టిబడిందిలా..
ప్యాపిలి సమీపంలోని పెద్దమ్మడాబా దగ్గర బుధవారం రిటైర్డ్ సీటీవో సుబ్బరాయుడు, ఆయన కొడుకు సురేష్ కలిసి వాహనాలు నిలిపి వాహన దారుల నుంచి డబ్బు డిమాండ్ చేశారు. అదే సమ యంలో డోన్ వెహికల్ అండ్ మోటారు ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ కూడా కొంతదూరంలో రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని నిలిపి వసూళ్లకు పాల్పడటాన్ని గమనించిన ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్‌కు అనుమానం వచ్చి వారి దగ్గరకు వెళ్లారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి వివరాలను అడిగాడు. తాను సీటీవో అని సుబ్బ రాయుడు గుర్తింపుకార్డు చూపించారు. అయితే వారి మాటల్లో తడబాటును గమనించిన క్రాంతికుమార్‌కు అనుమానం వచ్చింది. వెంటనే తమ సిబ్బంది సాయంతో నిందితులను ప్యాపిలి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసుల విచారణలో తండ్రి, కొడుకుల అక్రమ వసూళ్ల బాగోతం బయటపడింది.
తండ్రీకొడుకులపై కేసు నమోదు
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న తండ్రి సుబ్బరాయుడు, కొడుకు సురేష్‌తో పాటు కారు డ్రైవర్ అక్షయ్‌పై కేసు నమోదు చేసినట్లు ప్యాపిలి ఎస్‌ఐ మదుసూధన్ తెలిపారు. డోన్ వెహికల్ అండ్ మోటారు ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరి అక్రమాలపై మరింత పూర్తి విచారణ చేస్తామని ఎస్‌ఐ మధుసూధన్ వెల్లడించారు.