Share News

జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20వేల కోట్లు కేటాయించాలి

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:08 PM

జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20 వేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్‌ చేశారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20వేల కోట్లు కేటాయించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20 వేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం సీఆర్‌ భవన్‌లో జిల్లా సహయ కార్యదర్శులు ఎస్‌.మునెప్ప, లెనిన్‌ బాబులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకప్పడు రాజధానిగా వెలుగొందిన కర్నూలు జిల్లా ప్రస్తుతం అన్నివిధాలుగా వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు 106 చెరువులను నింపాలన్నారు. పందికోనం, క్రిష్ణగిరి రిజర్వాయర్ల కింద ఆయకుట్టు స్థిరీకరణ పనులు పూర్తి చేసి జిల్లాలో లక్ష ఎకరాలకు తాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎయిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలన్నారు. రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.500 కోట్లు నిధులు విడుదల చేయాలన్నారు. ఆదోని, ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్‌ పరిశ్రమల ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఒంగోలులో సీపీఐ 28వ రాష్ట్ర మహసభలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కె.జగన్నాథం, జి.చంద్రశేఖర్‌, కె.శ్రీనివాసులు, రామకృష్ణ, మహేష్‌, శ్రీనివాసరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Aug 11 , 2025 | 11:08 PM