Share News

కమీషన్ల కింద ఏటా.. రూ.2కోట్లు హాంఫట్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:48 PM

ప్రధాన పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిని నష్టాలు చూపినా కనీస పెట్టుబడులను దక్కించే టమోటా సాగునే పశ్చిమప్రాంత రైతులు ఎక్కువగా నమ్ముకుంటారు.

కమీషన్ల కింద ఏటా.. రూ.2కోట్లు హాంఫట్‌
పత్తికొండ మార్కెట్‌కు వచ్చిన టమోటా

దోపిడీకి గురవుతున్న టమోటా రైతులు

నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు

10శాతం సుంకం వసూలు చేస్తున్న వ్యాపారులు

ఏటా రూ15 నుంచి రూ.20 కోట్ల మేర లావాదేవీలు

మార్కెట్‌యార్డ్‌లో మాఫియాను తలపిస్తున్న వ్యాపారుల ఆగడాలు

ప్రధాన పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిని నష్టాలు చూపినా కనీస పెట్టుబడులను దక్కించే టమోటా సాగునే పశ్చిమప్రాంత రైతులు ఎక్కువగా నమ్ముకుంటారు. ఆదుకుంటుందను కున్న టమోటా మంచి దిగుబడులొచ్చినా అమ్మేందుకు వెళ్లి మార్కెట్లో వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. కూరగాయలు, టమోటా పంటల కొనుగోలుపై సుంకం వసూలును ప్రభుత్వం ఎత్తివేసినా పంట కొనుగోలుపై 10శాతం కమీషన్‌ రైతుల నుంచి వసూలు చేస్తూ వ్యాపారులు అన్నదాత కష్టాన్ని అడ్డంగా దోచేస్తున్నారు. పంట కొనుగోలులో నిబంధనలు పాటించని వ్యాపారులు మార్కెట్‌యార్డ్‌కు చెల్లించాల్సిన ఒక్క శాతం సెస్‌ కూడా కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. మాఫియాను తలపిస్తూ ఏటా రైతుల కష్టాన్ని కోట్లలో కమీషన్‌ పేరిట దోచుకుతింటున్న పత్తికొండ మార్కెట్‌యార్డ్‌ టమోటా వ్యాపారుల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

పత్తికొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో ఖరీఫ్‌ కింద రైతులు 83 హెక్టార్లలో పంటలు సాగుచేస్తారు. ప్రధాన వాణిజ్య పంటలుగా వేరుశనగ, పత్తి, ఆముదం పంటలతో పాటు ఉల్లి, కంది పం టలు అధికంగా సాగుచేస్తారు. దీనితో పాటు ప్రత్యామ్నాయ పంటగా ప్రతిరైతు టమోటాను సాగుచేస్తారు. సుమారు రెండు వేల హెక్టార్లలో ఇక్కడి రైతులు టమోటాను సాగుచేస్తుంటారు. పండిన టమోటాను పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తుంటార ు. వ్యాపారులు రైతుల నుంచి అనధికారికంగా 10శాతం సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో రూ.1.5కోట్ల నుంచి రూ.2కోట్లు మాయం చేస్తున్నారు. మార్కెట్‌యార్డులో వ్యాపారుల కమీషన్‌ దోపిడీకి అడ్డుకుట్టవేసి వారి ఆగడాల నుంచి రైతులను కాపాడాల్సిన అవసరముంది.

ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం..

ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కూరగాయలు, టమోటా వంటి పచ్చిసరుకుపై సుంకం పూర్తిస్థాయిలో ఎత్తివేసి ఆపంట కొనుగోలుపై సుంకం వసూలు చేయరాదని జీవోలు జారీచేసింది. పత్తికొండ మార్కెట్‌ యార్టులో జీరో సుంకం విధించిన ఈ ఐదేళ్ల కాలంలో 10శాతం సుంకాన్ని పంట కొనుగోలులో రైతుల నుంచి అనధికారికంగా వసూలు చేస్తున్నారు. వ్యాపారులందరూ సిండికేట్‌గా ఈమార్కెట్లో కొనుగోళ్లు, కమీషన్‌ వసూళ్లు చేస్తుండడంతో మార్కెట్‌శాఖ అధికారులు ఆంక్షలు విధిస్తే కొనుగోళ్లకు దూరంగా ఉంటా మని బెదిరింపులకు దిగుతుంటారు.

ఎకరాకు 4క్వింటాళ్ల దిగుబడి..

ఎకరా టమోటా సాగుకు నారు, ఎరువులు, పిచికారి మందులు అన్ని కలుపుకుని రూ.30వేల దాకా వస్తుంది. మంచి దిగుబడులు వస్తే కోతకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సకాలంలో పంటకు నీరు అందితే 30కోతల వరకు రైతులకు పంట కాలం వస్తుంది.

కోత కోసిన పంటను మార్కెట్‌కు తరలించేందుకు

10కిలోల గంపకు రూ10, 25కిలోల గంపకు రూ.20 చొప్పున చెల్లించాలి. పంట పెట్టుబడులు, కోతకూలీలు, ఆటోబాడుగలు కలుపుకుంటే కిలో కనీసం రూ.8కు పంట అమ్ముడుపోతే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. పత్తికొండ మార్కెట్‌యార్డ్‌లో వ్యాపారులు తమకు నచ్చిన ధరతో పంటను కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తుంటారు.

వేరే వ్యాపారులు వస్తే బెదిరింపులే..

పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు పూర్వం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో టమోటా విక్రయాలు జరిగేవి. పత్తికొండ వ్యాపారులతో పాటు హైదరాబాద్‌, వరంగల్‌, చెన్నై, తమళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోళ్లలో పాల్గొనే వారు. మార్కెట్‌ యార్డు ఏర్పాడ్డాక కూడా వేరేప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ పంట కొనుగోలులో పాల్గొనేవారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధరలకు లభించేవి. స్థానికంగా ఉన్న వ్యాపారులు సిండికేట్‌గా మారి వేరే ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు రాకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడి వ్యాపారులు 10శాతం సుంకం అక్రమంగా వసూలు చేసినా ఏమీచేయలేని పరిస్థితి ఉన్నట్లు మార్కెట్‌ శాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది నేరుగా తమబాధను చెప్పుకుంటున్నారు.

ఒక్క శాతం సెస్‌ ఎగవేత

టమోటా కొనుగోళ్లకు సంబంధించి జరిగిన వ్యాపా రంపై ఒక్క శాతం మార్కెట్‌యార్డుకు సెస్‌ చెల్లించాలి. మార్కెట్‌యార్డులో వ్యాపార లావాదేవీలు జరుపుకునేందుకు ఈసెస్‌ను వ్యాపారులు మార్కెట్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

బయటి వ్యాపారులు రాకుండా తాము మాత్రమే టమోటా కొనుగోలుచేస్తున్న స్థానిక వ్యాపారులు అక్రమంగా వసూలుచేసే 10శాతం సుంకం ఆపకపోగా మార్కెట్‌యార్డుకు చెల్లించాల్సిన 1శాతం సెస్‌ను కట్టకుండా ఎగవేస్తున్నట్లు తెలిసింది. అధికారులను సైతం వారు బెదిరిస్తూ మాఫియాను తలపిస్తున్నట్లు సమాచారం.

ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 కోట్ల..

మార్కెట్‌యార్డులో ఏటా రూ.15 నుంచి రూ.20కోట్ల మేర టమోటా వ్యాపారం జరుగుతు న్నట్లు అధికారిక నివేదికల ద్వారా తెలుస్తుంది. అనధికారికంగా ఈమొత్తం ఇంకా ఎక్కువ ఉం డవచ్చని సమాచారం. గత ఏడాది ఆగస్టు నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఏడు నెలల పాటు ఈమార్కెట్‌లో టమోటా విక్రయాలు జరగగా 72,642 టన్నుల టమోటాను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. 6నుంచి 8టన్నుల వరకు లారీల ద్వారా వ్యాపారులు కొన్నపంటను తరలిస్తుంటారు. గత ఏడాది 10 నుంచి 12వేల లారీల సరుకును వ్యాపారులు ఇక్కడి నుంచి ఎగుమతులు చేశారు. ఏడునెలల పాటు జరిగిన 72,642 టన్నులకు గాను రూ.15 నుంచి 20కోట్ల వరకు వ్యాపారులు లావాదేవీలు జరిపారు.

పేరుకే పెద్దమార్కెట్‌

పత్తికొండ టమోటా మార్కెట్‌ పేరుకే పెద్ద మార్కెట్‌. టమోటా మార్కెట్‌ ద్వారా మార్కట్‌యార్డుకు అందుతున్న ఆదాయం మాత్రం నామమాత్రమే. గత ఏడాది రూ.8లక్షలు మాత్రమే వ్యాపారుల నుంచి సెస్‌ డబ్బులు అందాయి. వారం సంతద్వారా వారానికి రూ.60 నుంచి రూ.70వేల ఆదాయం ఉండటంతో సిబ్బంది జీతభత్యాలు ఇవ్వగలుగుతున్నాం.

కార్నలీస్‌, కార్యదర్శి, పత్తికొండ మార్కెట్‌యార్డు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్తికొండ మార్కెట్‌యార్డులో టమోటా కొనుగోళ్లు జరిగేలా చర్యలు చేపట్టాలి. గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న రైతులపై 10శాతం కమీషన్‌ దోచుకోవడం దారుణం. టమోటా కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేసి వ్యాపారులపై చర్యలుచేపట్టాలి.

డి .రాజాసాహెబ్‌, ఏపీ రైతుసంఘం జిల్లాకార్యవర్గ సభ్యుడు

Updated Date - Aug 05 , 2025 | 11:49 PM