ప్రమాదాల రహదారులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:44 PM
ప్రమాదాల రహదారులు
జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
రక్తసిక్తమవుతున్న జాతీయ రహదారి
కనీస భద్రతా చర్యలు పాటించకపోవడమే కారణమా..?
అనుభవం లేని డ్రైవర్లతో ట్రావెల్ బస్సులు నడిపిస్తున్న యాజమాన్యం
రహదారి ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 85 కిలోమీటర్లకు పైగా ఉన్న హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి మీద నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఒకరు ఇద్దరు మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. శుక్రవారం కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను తోసుకుపోయి మంటల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు కాలిపోయిన ఘటనలో 19 మంది ప్రయాణికులు ఆగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ నేపఽథ్యంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీరును పరిశీలిస్తే గుండెలు పగిలే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జాతీయ రహదారులు, స్టేట్ హైవే రహదారుల్లో ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు, పోలీసులు హడావుడి చేస్తున్నారు. తరువాత షరా మామూలే అని వదిలేస్తు న్నారు. ఏటేటా భద్రతా వారోత్సవాలు నిర్వహించినా ప్రమాదాలు తగ్గడం లేదు. పైగా పెరుగుతూనే ఉన్నాయి. రవాణా శాఖ అధికారుల్లో అలసత్వం, సిబ్బంది కొరత, పోలీసులు శాంతి భద్రత పర్యవేక్షణకే పరిమితం కావడం వంటి సమస్యలు ఉన్నాయి. ప్రమాదాల నివారణ ప్రకటనలకే పరిమితమైంది. దీనికి తోడు అనుభవం లేని డ్రైవర్ల వల్ల ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వస్తున్నది. దేశవ్యాప్తంగా మానవ తప్పిదాల వల్లే 95 శాతం ప్రమాదాలు జరిగితే, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల 75 శాతం, మరో 25 శాతం రోడ్లు, వాహనాల మరమ్మతుల కారణంగా జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాలో 600-800 మందికి పైగా మృత్యువాత పడితే, 3 వేల మందికిపైగా గాయాల పాలవుతున్నాయి.
జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాలు కొన్ని
ఈ ఏడాది మే 20న ప్యాపిలి సమీపంలో జాతీయ రహదారి-44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు
2019 మే 11న వెల్దుర్తి సమీపంలో చెక్‌పోస్టు వద్ద తుఫాన్ జీపును ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మృతులంతా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లె మండలం రామాపురం గ్రామానికి చెందినవారు.
2021 ఫిబ్రవరి 15న మాదార్‌పురం గ్రామం వద్ద మినీ బస్‌ను లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. వెల్దుర్తి సర్కిల్‌లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకరు ఇద్దరు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
2019-21 మధ్య కాలంలో వెల్దుర్తి-మాదార్‌పురం మధ్య పలు ప్రమాదాలు జరిగాయి. మాదార్‌పురం సమీపంలో ఓ వాహనం బోల్తాపడి పలువురు మృత్యువాత పడ్డారు.
కర్నూలు-చిత్తూరు వయా నంద్యాల, ఆళ్లగడ్డ జాతీయ రహదారిలో ఆళ్లగడ్డ, చాగలమర్రి మధ్య నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి-44పై కర్నూలు నగరం సంతోష్ నగర్, చిన్నటేకూరు, ఉల్లిందకొండ క్రాస్, దత్తాత్రేయస్వామి ఆలయం సమీపంలో, వెల్తురి సర్కిల్ ఆంజనేయస్వామి విగ్రహాం, మదార్‌పురం, ప్యాపిలి క్రాస్ రోడ్డు.. వంటి ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. తాజాగా కర్నూలు నగర శివారులో వెంకన్నబావి ప్రాంతం కూడా ప్రమాదకరంగా మారింది.