రైతులతో ఆటలు..
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:22 AM
మండలంలోని బసినేపల్లి, మదనంతపురం గ్రామాల్లో వైసీపీ హయాంలో చేసిన రీ సర్వేలో అవకతవకలుగా చోటుచేసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
రీ సర్వే లోపాలు సరిచేయకుండా రైతులను తిప్పుకుంటున్న రెవెన్యూ అధికారులు
భూమి తక్కువగా చూపుతుండటంతో అవస్థలు పడుతున్న రైతులు
మద్దికెర, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బసినేపల్లి, మదనంతపురం గ్రామాల్లో వైసీపీ హయాంలో చేసిన రీ సర్వేలో అవకతవకలుగా చోటుచేసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు గ్రామాలు హంపా రెవెన్యూ పరిధిలో ఉండగా, దాదాపు 5వేల ఎకరాలు సాగు భూమి ఉంది. గతంలో అన్యాయం జరిగిం దని, కూటమి ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తారని రైతులు ఆశించారు.
కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతులు
తమ భూ సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకంతో రైతులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుతున్నారు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నా రెవెన్యూ అధికారులు కనికరం చూపడంలేదని వాపోతున్నారు. ఈ విషయంపై తహీసల్దార్ గుండాల్ నాయక్ మాట్లాడుతూ రికార్డులను పరిశీలించి న్యాయం చేస్తామని, ఎవరికీ ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.
ఎకరా తక్కువగా వచ్చింది
పెద్దల నుంచి ఐదెకరాల పొలం వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే చేసి ఎకరా తగ్గించారు. న్యాయం చేయాలని ఆరు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. - ప్రతాప్, బసినేపల్లి
తిప్పుకుంటున్నారు
నా పొలానికి సంబందించిన అన్ని రికార్డులు ఉన్నాయి. అయినా 1.5 ఎకరాలు చూపించడం లేదు. రోజూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. - ఏసప్ప, బసినేపల్లి