Share News

ప్రతి శుక్రవారం రెవెన్యూ గ్రీవెన్స్‌: కలెక్టర్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:10 PM

రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం నిర్దేశించిన మండలంలో రెవెన్యూ గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు.

ప్రతి శుక్రవారం రెవెన్యూ గ్రీవెన్స్‌: కలెక్టర్‌
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం నిర్దేశించిన మండలంలో రెవెన్యూ గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా రెవెన్యూ శాఖకు సంబందించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వాటికి మండల స్థాయిలోనే పరిష్కారం చూపేందుకు ప్రతి శుక్రవారం నిర్దేశించిన ఒక మండలంలో రెవెన్యూ గ్రీవెన్స్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ గ్రీవెన్స్‌కు జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో హాజరవుతారన్నారు.

త్వరలో ‘పల్లెకు పోదాం’: జిల్లాలో గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం త్వరలో ‘పల్లెకు పోదాం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇందు కోసం 83 మంది అధికారులను నియమించామని చెప్పారు. గ్రామాల్లో తాగునీరు వైద్య, ఆరోగ్యం, అంగన్‌వాడీ స్కూల్స్‌, హాస్టల్స్‌, హౌసింగ్‌, పారిశుధ్యం, తదితర అంశాలపై అధికారులు తనిఖీ చేసి అందుకు సంబంధించిన నివేదికను ‘పల్లెకు పోదాం’ పోర్టల్‌లో పొందుపరిచి ఆ సమస్యలను పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జేసీ బి.నవ్య, డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:10 PM