జలాశయాలు కళకళ
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:02 AM
కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రాయలసీమ జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి
శ్రీశైలానికి పోటెత్తిన వరద
సుంకేసులకు 1.10 లక్షల క్యూసెక్కుల ఫ్లో
తుంగభద్ర డ్యాం నుంచి 1.19 లక్షల క్యూసెక్కులు విడుదల
నదితీర గ్రామాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
కర్నూలు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రాయలసీమ జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. సీమ జీవనాడి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయానికి డ్యాం వద్ద 2,10,920 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతుండగా, ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 1,28,175 క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజీ (తుంగభద్ర నది) నుంచి 1,03,437 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గంట గంటకు వరద పెరుగుతుండడంతో పది క్రస్ట్ గేట్ల ద్వారా 1,35,325 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ద్వారా 65,904 క్యూసెక్కులు చొప్పున 2,01,229 క్యూసెక్కులు దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమ కాలువలకు 31 వేలు, హంద్రీనీవా కాలువ ద్వారా 2,818 క్యూసెక్కులు, తెలంగాణ రాష్ట్రం మహాత్మగాంధీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వరద పోటెత్తింది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 885 అడుగుల, సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా 882.80 అడుగుల లెవల్‌లో 203.42 టీఎంసీలు నిల్వ చేసి వచ్చిన వరదను వచ్చినట్లుగా స్విల్‌వే, విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలేస్తున్నారు.
సుంకేసులకు వరద కళ
కర్నూలు నగరానికి 26 కి.మీల దూరంలో ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరు తోంది. గరిష్ఠ నీటి నిల్వ 1.20 టీఎంసీలే. ఎగువన నుంచి రాత్రి 8.30 గంటల సమయంలో 1.10 లక్షల క్యూసెక్కులు బ్యారేజీకి వచ్చి చేరుతోంది. 0.634 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసి డ్యాం భద్రతా దృష్ట్యా 20 గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్లుగా 1.10 లక్షల క్యూసెక్కులు దిగువ శ్రీశైలానికి వదిలేస్తున్నారు. ఎగువన తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతుంది. 96,836 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు, సామ ర్థ్యం 105.78 టీఎంసీలు కాగా, గతేడాది 19వ గేటు కొట్టుకుపోవడంతో డ్యాం భద్రత దృష్ట్యా 1,624.54 అడుగుల లెవల్‌లో 75.601 టీఎంసీలు నిల్వ చేశారు. 28 గేట్లు ఎత్తి 1.06,548 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ నుంచి వరద పెరుగుతుండడంతో రాత్రి 8:30 గంటల సయమానికి 1,19,613 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. మంత్రాలయం వద్ద 1,18,140 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అలాగే మేళిగనూరు వద్ద వేదవతి నది, వాగులు కలుస్తుండడంతో ఆర్డీఎస్ వద్ద వరద పోటెత్తింది. మంగళవారం ఉదయానికి సుంకే సులకు భారీగా వరద నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి సుంకేసుల బ్యారేజీ గేట్లను పరిశీలించారు. అలాగే ఎగువన తుంగభద్ర డ్యాం నుంచి వరద పెరుగుతుండడంతో కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, కర్నూలు రూరల్ మండలాల్లోని నదితీర గ్రామాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.