Share News

కర్నూలు-హోస్పెట్‌ వయా ఎమ్మిగనూరు

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:09 AM

కర్నూలు - హోస్పెట్‌ వయా ఎమ్మిగనూరు, ఆదోని, తోర్నకల్లు మీదుగా నూతన రైలు మార్గం నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఆ లేఖను బుధవారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్‌కు అందజేశారు.

కర్నూలు-హోస్పెట్‌ వయా ఎమ్మిగనూరు
రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు లేఖ ఇస్తున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

నూతన రైలు మార్గం కోసం రైల్వే మంత్రికి సీఎం లేఖ

కర్నూలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు - హోస్పెట్‌ వయా ఎమ్మిగనూరు, ఆదోని, తోర్నకల్లు మీదుగా నూతన రైలు మార్గం నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఆ లేఖను బుధవారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్‌కు అందజేశారు. అదే క్రమంలో ఈ రైలు మార్గం నిర్మాణం చేస్తే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం పారిశ్రామిక, రవాణా రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, సర్వే, డీపీఆర్‌ తయారు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే బీవీ కూడా మరో లేఖను అందజేశారు. ఇప్పటికే మంత్రాలయం - కర్నూలు వయా ఎమ్మిగనూరు, కోడుమూరు మధ్య 110 కిలో మీటర్ల రైలు మార్గం నిర్మాణం రీసర్వే కోసం రూ.28 లక్షలు కేటాయించారు. తాజాగా కర్నూలు - హోస్పెట్‌ వయా ఎమ్మిగనూరు, ఆదోని మధ్య మరో నూతన రైలుమార్గం నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేయడంతో ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో ప్రగతి పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇది మెరుగైన కనెక్టివిటీ అని, పశ్చిమ ప్రాంతం అభివృద్ధితో దేశ ఆర్థిక ప్రగతికి ఊతం ఇస్తుందని ఆ లేఖలో సీఎం చంద్రబాబు వివరించారు. కర్ణాటక రాష్ట్రం హోస్పెట్‌, బళ్లారి ప్రాంతంలో ఖనిజ సంపద, ఐరన్‌కు కేంద్రంగా ఉంది. ప్రస్తుతం బళ్లారి, గుంతకల్లు, గుత్తి మీదుగా సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నాయని, నూతన రైలు మార్గం నిర్మిస్తే.. తోర్నగల్లు-గుంతకల్లు/గుత్తి రైల్వే కారిడార్‌లోని రద్దీ, రవాణా ఒత్తిడిని తగ్గించవచ్చని వివరించారు. అదే క్రమంలో దక్షిణాది ప్రముఖ పుణ్య క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి క్షేత్రాన్ని కలుపుతూ మంత్రాలయం రోడ్‌ స్టేషన్‌ నుంచి కొత్తగా ప్రతిపాదించే రైలుమార్గానికి అనుసంధానం (కనెక్టివిటీ) చేస్తే పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహిం చవచ్చని ముఖ్యమంత్రి రాసిన లేఖలో వివరించారు. ఈ విషయంపై ఎంపీ బస్తిపాటి, ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధిని కాంక్షిస్తూ నూతన రైలుమార్గం ప్రతిపాదిస్తూ రైల్వే మంత్రి అశ్విన్‌వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు రాసిన లేఖను అందజేశామన్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధిగా మరో లేఖను అందజేశామన్నారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సర్వే, డీపీఆర్‌ తయారు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:09 AM