Share News

తాటి ముంజలతో ఉపశమనం

ABN , Publish Date - May 04 , 2025 | 11:41 PM

వేసవిలో మండే ఎండలే కాదు, మధుర ఫలాలు కూడా లభిస్తాయి. ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లోని పెద్ద తుంబలం, చిన్న తుంబలం, జాలమంచి, పెద్దకడబూరు, గవిగట్టు, కోసిగి గ్రామాల్లో తాటివనాలు విస్తారంగా ఉన్నాయి.

తాటి ముంజలతో ఉపశమనం
ఆదోనిలో తాటి ముంజలను విక్రయిస్తున్న గ్రామస్థులు

ఆదోని అగ్రికల్చర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): వేసవిలో మండే ఎండలే కాదు, మధుర ఫలాలు కూడా లభిస్తాయి. ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లోని పెద్ద తుంబలం, చిన్న తుంబలం, జాలమంచి, పెద్దకడబూరు, గవిగట్టు, కోసిగి గ్రామాల్లో తాటివనాలు విస్తారంగా ఉన్నాయి. గ్రామస్థులు అక్కడి నుంచి తాటి ముంజలను పట్టణానికి తెచ్చి విక్రయిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాల్లోని రహదారుల వద్ద వీటిని విక్రయిస్తున్నారు. డజన్‌ రూ. 60నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనానికి వినియోగదారులు తాటి ముంజలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

విలువలు అధికం...

వేసవిలో మాత్రమే లభించే తాటిముంజలను మధుర ఫలంగానూ పేర్కొంటారు. ముంజల్లో 87 శాతం నీరు ఉంటుంది. వీటిలోని పోషక విలువలు వడదెబ్బ నివారణకు, శరీర ఉష్ణోగ్రతలను తగ్గించ డానికి ఉపయోగపడతాయి. తాటిముంజల లోపటి తెల్లని పదార్థం వేసవి తాపం నుంచి రక్షిస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.పోషక

తాటి ముంజల్లో పోషకాలు అధికం

తాటి ముంజల్లో అధిక పోషకాలు ఉన్నాయి. ఇవి వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు పోషకాలు ఇస్తాయి. నీరు, కార్బోహైడ్రేడ్‌, ప్రొటీన్స్‌, పీచు పదార్థాలు ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. - డాక్టర్‌ కె.వినోద్‌ కుమార్‌, వైౖద్యాధికారి, అర్బన్‌ సెంటర్‌, ఆదోని

Updated Date - May 04 , 2025 | 11:41 PM