Share News

ఉల్లి రైతులకు ఊరట

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:39 PM

కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.

ఉల్లి రైతులకు ఊరట
జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

హెక్టారుకు రూ.50వేలు పరిహారం

జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఉల్లిని సాగు చేసిన రైతులకు నేరుగా హెక్టారుకు రూ.50వేల చొప్పున వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంలో భాగంగా సోమవారం నుంచి క్వింటాకు రూ.1,200 మద్దతు ధర అమలులో ఉండదని స్పష్టం చేశారు. రైతులు తమ ఉల్లి పంటను గ్రామాల్లోనే తమ పొలాల్లో లేదా లోకల్‌ ట్రేడర్స్‌ వద్ద, ఇతర మార్కెట్‌లలో ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని వివరించారు. మార్కెట్‌ యార్డులో అమ్ముడుపోని ఉల్లిని రైతులు తీసుకెళ్లి ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు. భారీ వర్షాలు లేదా వరదలు వస్తే విపత్తు సాయంగా హెక్టారుకు రూ.25వేలు మాత్రమే ఇప్పటిదాకా మంజూరు చేయడం జరిగేదని, కానీ ప్రస్తుతం ఉల్లి రైతులను ఆదుకోవాలనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెట్టింపు మొత్తంతో అంటే హెక్టారుకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారన్నారు. సోమవారం నుంచి మార్కెట్‌ యార్డులో ఉల్లి విక్రయాలు వ్యాపారుల ద్వారా జరుగుతాయని మార్క్‌ఫెడ్‌ ద్వారా అమ్మకాలు జరగవని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. ఆదివారం కర్నూలు మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించడం జరిగిందని, రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెట్‌ యార్డుకు ఉల్లిని తీసుకురావద్దని జాయింట్‌ కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 20 , 2025 | 11:39 PM