ఉపాధి కూలీలకు ఊరట
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:54 PM
జిల్లాలో ఉపాధి కూలీలకు ఐదు నెలలుగా వేతన బకాయిలు పేరుకుపోయాయి. కూలీల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
వేతన బకాయిలు మంజూరు
రూ.100 కోట్లు కూలీల ఖాతాల్లో జమ
పెండింగ్ వేతనాలు రూ.30కోట్లు
నంద్యాల, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి కూలీలకు ఐదు నెలలుగా వేతన బకాయిలు పేరుకుపోయాయి. కూలీల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈనేపథ్యంలో ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,669 కోట్లు విడుదల చేయగా ఇందులో జిల్లాకు రూ.100కోట్ల వరకు కూలీల వేతనాలు మంజూరయ్యాయి. దీంతో ఆయా కూలీలకు అతి త్వరలోనే తమ ఖాతాలకు సదరు వేతనం జమకానుంది. దీంతో ఒక్కసారిగా ఉపాధి కూలీలలకు ఊరట కలిగినట్లైంది.
జిల్లాలో పరిస్థితి ఇలా...
ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన కార్డులు : 2.67 లక్షలు
పనికి వస్తున్న జాబ్ కార్డులు (కుటుంబాలు వారీగా) : 2.15లక్షలు
జిల్లా వ్యాప్తంగా ఐదు నెలల్లో..
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు నెలల్లో 49.70 లక్షల పని దినాలు ఉపాధి కూలీలకు కల్పించారు. ఇందులో 100 రోజులు పూర్తిచేసిన కుటుంబాలు 820 ఉన్నాయి. ఈ ఐదు నెలల్లో జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీల పరంగా రూ. 130 కోట్ల వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రకారం.. రూ. 100 కోట్లు బిల్లులు మంజూరయ్యాయి. మిగిలిన రూ.30 కోట్ల పెండింగ్ బిల్లులు త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
వేతనాలు చెల్లింపు జాప్యంతో..
ఉపాఽధి కూలీలలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూలీల వేతనాలు చెల్లింపు జాప్యంతో కూలీలకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో ఐదు నెలలకు పైగా లక్షల మందికి రూ.కోట్లలో వేతనాలు బకాయిలు పడినట్లైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ పనులతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత కింద గ్రామాల్లో పంట కుంటలు, పశువుల నీటి తొట్టెలు, చెరువులు అభివృద్ది, వివిధ పూడికతీత పనులు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా కూలీల వేతనాలు పెండింగ్‌లో పడినట్లైంది. ఇటీవల వేతనాలు మంజూరు చేయడంతో వారిలో ఆనందోత్సవం మొదలైంది. తిరిగి పనులపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం.
నేరుగా కూలీల ఖాతాలకు..
ఉపాధి కూలీల వేతనాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసింది. నేరుగా ఉపాధి కూలీల ఖాతాలకు జమ అవుతోంది. ఇప్పటికే ఖాతాలకు జమ పక్రియ ప్రారంభమైంది. పెండింగ్ వేతనాలు కూడా త్వరలోనే పడుతాయి.
సూర్యనారాయణ, పీడీ, డ్వామా