కంది రైతు ఖుషీ..
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:30 PM
వరుస నష్టాలతో ఇబ్బంది పడుతున్న రైతును కంది పంట ఆదుకుంది. మొంథా తుఫాన్ ప్రభావం ఈ పంటపై ఓర్వకల్లు మండలంలో ప్రభావం చూపకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఫమంచి ధర వస్తుందని రైతుల ఆశలు
తిప్పాయపల్లెలో కళకళలాడుతున్న కంది పంట
ఓర్వకల్లు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వరుస నష్టాలతో ఇబ్బంది పడుతున్న రైతును కంది పంట ఆదుకుంది. మొంథా తుఫాన్ ప్రభావం ఈ పంటపై ఓర్వకల్లు మండలంలో ప్రభావం చూపకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మండలంలోని తిప్పాయపల్లె, శకునాల, బ్రాహ్మణపల్లె, గుమితం తండా, గుడుంబాయి తండా, మీదివేముల, వెంకటాపురం, సోమయాజులపల్లె, చెన్నంచెట్టిపల్లె, గుట్టపాడు, ఎన్.కొంతలపాడు గ్రామాల్లో 2వేల ఎకరాల్లో కంది సాగు చేశారు.
ప్రధాన పంటగా కంది..
గతంలో వేరుశనగ సాగుచేసి, కందిని అంతర పంటగా సాగు చేసేవారు. అయితే వేరుశనగతో నష్టపోయిన రైతులు ఈ ఏడాది కందిని ప్రధాన పంటగా సాగుచేసి, అంతర పంటగా వేరుశనగను సాగుచేవారు. దిగబడులు ఆశించిన స్థాయిలో ఉంది. అలాగే వేరుశనగ కంటే కంది పంటకే ఎక్కువ బీమా వచ్చే అవకాశం ఉండటంతో కూడా కొంత మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. గతంలో పొగాకు సాగుచేసి రైతులు దెబ్బతినన్నారు.
కంది సాగుతో నష్టపోలేదు
నాలుగేళ్ల నుంచి మూడెకరాల్లో, ఈ ఏడాది ఐదెకరాలు సాగుచేశార. మంచి దిగుబడులు వచ్చాయి. సొంత భూమితో పాటు మరి కొంత కౌలుకు తీసుకున్నా. కంది సాగుచేసినప్పటి నుంచి నాకెప్పుడూ నష్టం రాలేదు. ఈ ఏడాది ఐదెకరాల్లో సాగు చేశాను. పైరు ఆశాజనకంగా ఉంది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర వస్తే అప్పుల్లో నుంచి బయటప డవచ్చు. - గొల్ల నాగరాజు, రైతు, హుశేనాపురం
కందికి ధర ఉంది
ఈ ఏడాది కంది పంట బాగుంది. పంట ఏపుగా పెరిగి పూత, పిందె దశలో ఉంది రైతులు మందులను పిచికారీ చేసి తెగుల్లను నివారించుకోవాలి. వ్యవసాయాధికారులను సంప్రదించి మందులను వాడాలి. - మధుమతి, ఏవో, ఓర్వకల్లు