Share News

అక్రమార్కులపై చర్యలకు సిద్ధం?

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:07 AM

ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మేజర్‌ పంచాయతీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనతో రూ.1.88 కోట్లు దుర్వినియోగం అయ్యాయి.

అక్రమార్కులపై చర్యలకు సిద్ధం?
రుద్రవరం పంచాయతీ కార్యాలయం

మూడోసారి విచారించిన అధికారులు

కలెక్టర్‌ వద్దకు నివేదిక

రుద్రవరం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌, ఉద్యోగుల్లో అలజడి

నంద్యాల, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మేజర్‌ పంచాయతీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనతో రూ.1.88 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. ఈ నేపఽథ్యంలో ఆంధ్రజ్యోతిలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ‘ఏకమై కాజేశారు’, మార్చి 5న ‘వేటుకు రంగం సిద్ధం’ కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్‌ రాజకుమారి సదరు పంచాయతీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. రెండు సార్లు విచారణ చేసినా సమగ్రంగా లేకపోవడంతో గత పది రోజుల క్రితం మరోసారి ప్రత్యేక అధికారుల ద్వారా విచారణకు ఆదేశించి అక్రమాల్లో అభియోగాలు పొందిన సదరు కార్యదర్శులు, ఉద్యోగులు, సర్పంచ్‌ వారం రోజులలోపు తగిన వివరణ ఇచ్చేలా ఆదేశించాలని చేయాలని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అభియోగాలు పొందిన ఐదుగురిలో ఒక కార్యదర్శి, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ మాత్రమే విచారణ అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరు కార్యదర్శులు, సర్పంచ్‌ ఎలాంటి వివరణ ఇవ్వనట్లు తెలుస్తోంది. దీంతో విచారణ అధికారులు పంచాయతీలో జరిగిన అక్రమాలతో పాటు ఇద్దరు ఉద్యోగులు ఇచ్చిన వివరణ మిగిలిన వారు స్పందించిన తీరు తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను రెండు రోజుల క్రితం విచారణ అధికారులు సదరు జిల్లా పంచాయతీ అధికారికి అందజేసినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో సదరు అధికారి సైతం తగిన సమగ్ర నివేదికను గురువారం కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిసింది. పంచాయతీలో జరిగిన అక్రమాలతో పాటు అక్రమాల్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది?, వివరణ ఇచ్చిన అధికారుల్లో ఏ మేరకు స్పష్టత ఉంది..? సర్పంచ్‌తో పాటు మిగిలిన ఇద్దరు కార్యదర్శులు స్పందించిన తీరుపై కూడా లిఖిత పూర్వకంగా నివేదించినట్లు తెలిసింది. అయితే సర్పంచ్‌ స్పందించకపోవడంతో సర్పంచ్‌ చెక్‌పవర్‌ రద్దుతో పాటు వివరణ ఇవ్వని ఇద్దరు అధికారులపై శాఖాపరమైన చర్యల నిమిత్తం కమిషనర్‌కు సిఫారసు చేసేవిధంగా పేర్కొన్నట్లు తెలిసింది. అదేవిధంగా వివరణ ఇచ్చిన ఒక కార్యదర్శితో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ కూడా ఇచ్చిన వివరణలో కొన్ని లోపాలు ఉన్నట్లు సమాచారం. దీంతో వీరిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఉద్యోగులు చేసిన నిధులు స్వాహా విషయమై రికవరీకి కూడా ఆదేశిస్తూ నివేదికలో పేర్కొన్నట్లు ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. వీటితో పాటు కొందరిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రుద్రవరం మేజర్‌ పంచాయతీలో జరిగిన అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలతో జిల్లా ఉన్నతాధికారులు కదలిక తేవడంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎవరిపై ఎలాంటి వేటు ఉంటుందోనని ఆయా ఉద్యోగులతో పాటు సర్పంచ్‌లో అలజడి మొదలైంది.

Updated Date - Apr 05 , 2025 | 12:07 AM