కష్టపడితేనే లక్ష్యాన్ని చేరుకుంటారు
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:14 AM
న్యాయవాదులు కష్టపడి పని చేస్తేనే తమ లక్ష్యాలను సాధిస్తారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన బార్ అసోసియేషన్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి
కర్నూలు లీగల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదులు కష్టపడి పని చేస్తేనే తమ లక్ష్యాలను సాధిస్తారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన బార్ అసోసియేషన్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ ఏ.హరిహరనాథశర్మ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు పాఠశాల బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత న్యాయవాదులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు న్యాయమూర్తులు ప్రధానం చేశారు. ఉదయం న్యాయాధికారుల సమీక్ష సమావేశాన్ని జస్టిస్ బీఎస్ భానుమతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ భానుమతి మాట్లాడుతూ న్యాయమూర్తులు కానీ, న్యాయవాదులు కానీ.. తమ లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి పని చేయాలని, దానికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. కర్నూలు జిల్లా నుంచి చాలా మంది న్యాయమూర్తులుగా రాణించారన్నారు. జూనియర్ న్యాయవాదులు తమ వృత్తిలో రాణించాలంటే సీనియర్ న్యాయవాదులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని పలు బార్ అసోసియేషన్లు వచ్చిన విజ్ఞాపన పత్రాల మేరకు న్యాయపరంగా
జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనకు కర్నూలు జిల్లాపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. కక్షిదారులకు న్యాయ వాదులు అందుబాటులో ఉంటేనే తగిన న్యాయం దక్కుతుం దన్నారు. జస్టిస్ ఎన్.హరినాథ్ మాట్లాడుతూ సుప్రీం కోర్టులో మంచి తీర్పులు రావాలంటే కింది స్థాయి న్యాయవాదులు తమ కోర్టుల్లో కష్టపడి పని చేయాలని తెలిపారు. న్యాయవాదులు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా పలు కోర్టుల్లో కక్షిదారులకు న్యాయ సహాయాన్ని అందిస్తే వృత్తిలో రాణించడానికి వీలుంటుందన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ ఏ.హరిహరనాథశర్మ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులు తాత్కాలిక ఆదాయానికి ఆశ పడకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. న్యాయవాదులు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పాలూరి రవిగువేరా, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.కృష్ణమూర్తి, బీఎస్ రవికాంత్ ప్రసాద్, జిల్లాలోని పలు న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -