ఏసీబీ వలలో ఆర్‌అండ్‌బీ ఏఈ
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:30 PM
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రోడ్లు, భవనాల శాఖ ఏఈ దస్తగిరి సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు.
కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రోడ్లు, భవనాల శాఖ ఏఈ దస్తగిరి సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు. సత్యసాయి జిల్లాకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ రమేశ్ పట్టణంలోని చింతకుంట రోడ్డులో ఓఎఫ్‌సీ కేబుల్ వేయడానికి నంద్యాల ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయంలో డబ్బులు చెల్లించి రోడ్ కటింగ్ పర్మిషన్ తీసుకున్నారు. ఈ పనులు ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ ఏఈ దూదేకుల దస్తగిరి సమక్షంలో చేయాల్సి ఉంది. ఇందుకోసం కాంట్రాక్టర్ ఏఈని సంప్రదించారు. ఈ పనులు చేసుకోవాలంటే తనకు రూ.70 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. అంత డబ్బులు ఇచ్చుకోలేనని, రూ.55 వేలు ఇస్తానని కాంట్రాక్టర్ ఒప్పుకొన్నారు. ఈ మేరకు రూ.40 వేలు నాలుగు రోజుల క్రితం ఏఈకి ఇచ్చారు. మిగతా రూ.15 వేలు ఇవ్వాలని ఏఈ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి చేశాడు. దీంతో కాంట్రాక్టర్ కర్నూలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఏఈ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్లు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.