Share News

ప్రజాభీష్టం మేరకే రేషన్‌

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:37 AM

ప్రజల అభీష్టం మేరకే రేషన్‌ దుకాణాల్లోనే సరుకులను అందజేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ప్రజాభీష్టం మేరకే రేషన్‌
దివ్యాంగుడికి ఇంటి వద్దనే రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ఇకపై మరింత పారదర్శకంగా రేషన్‌ పంపిణీ

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రజల అభీష్టం మేరకే రేషన్‌ దుకాణాల్లోనే సరుకులను అందజేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని పాతబస్టాండ్‌ సమీపంలోని రేషన్‌ దుకాణంలో నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌక దుకాణాలు పునః ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్‌ దుకాణాల్లో రేషన్‌ బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామ న్నారు. దివ్యాంగులు, వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్‌ పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో రేషన్‌ వాహనాల ద్వారా ఒక నిర్దిష్టమైన సమయం లేకుండా వారి ఇష్టారీతిన రేషన్‌ సరఫరా చేసేవారన్నారు. రేషన్‌ వాహనం ఎప్పుడు వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉండేదన్నారు. దీంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడేవారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ద్వారా ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకొని రేషన్‌ దుకాణాల్లోనే నిత్యావసరాల పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. గతంలో డోర్‌ డెలివరీ బియ్యం అంటూ జగన్‌ ప్రభుత్వం నానా హంగామా చేసిందన్నారు. కానీ అదంతా తప్పుడు ప్రచారమేనని ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఎక్కడో వీధి చివరన ఒక రోజు ఎండీయూ వాహనం నిలిపి బియ్యం పంపిణీ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. నెలలో 15 రోజుల పాటు రేషన్‌ సరుకులు ప్రజలకు అందేలా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు నారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దారు నాగేశ్వరరెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:37 AM