Share News

పట్టుపట్టారు సాధించారు

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:53 AM

ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు డీఎస్సీలో ప్రతిభ చాటారు. కొందరు పనులు చేసుకుంటూ సిద్ధపడగా, మరికొందరు ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ర్యాంకు సాధించారు.

పట్టుపట్టారు సాధించారు
తల్లిదండ్రులతో కుంకనూరుకు చెందిన హనుమంతు

డీఎస్సీలో సత్తా చాటిన అభ్యర్థులు

పలువురు కూలీల కుటుంబీకులే

ఆదోని అగ్రికల్చర్‌/మద్దికెర/ఆస్పరి/దేవనకొండ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు డీఎస్సీలో ప్రతిభ చాటారు. కొందరు పనులు చేసుకుంటూ సిద్ధపడగా, మరికొందరు ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ర్యాంకు సాధించారు. ఇక వీరు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం లాంఛనమే. - ఆదోని అగ్రికల్చర్‌, మద్దికెర, ఆస్పరి, దేవనకొండ

తల్లిదండ్రులు మృతిచెందినా దుఃఖాన్ని దిగమింగుకుని..

ఎన్ని ఆటంకాలు ఎదురైన అనుకున్నా లక్ష్యానికి చేరుకున్నారు. టీచర్‌ ఉద్యోగం సాధించాలన్న తపనతో రోజుకు 12 నుంచి 16 గంటల పాటు చదివి పట్టుబట్టి సాధించారు. ఆదోని పట్టణంలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి నగర్‌కు చెందిన లేట్‌ తమ్మారెడ్డి, వెంకటలక్ష్మి కుమారుడు ఎ.మహరాజు స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ సైన్స్‌) 76.45 మార్కులు సాధించి జిల్లాలో ఏడో ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు రెండేళ్ల క్రితమే మృతి చెందినా దుఃఖాన్ని దిగమించుకొని సెంట్రింగ్‌ పని చేస్తున్న తమ్ముడు విష్ణు బాధ్యతను మోశాడు. ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రమేష్‌ నాయుడు సూచన మేరకు సబ్జెక్టు బోధిస్తూ సాయంత్రం ట్యూషన్‌ చెబుతూ కుటుంబాన్ని పోషించుకొని కోచింగ్‌ తీసుకోకుండానే పోస్టు వచ్చిందన్నారు

ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ..

ఇందిరానగర్‌ కాలనీకి చెందిన హుసేనీ పవులమ్మ కుమారుడు మాధవరం సుమంత్‌ డీఎస్సీ లో స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం) జిల్లాలో ఎనిమిదో ర్యాంకు సాధించారు. బీటెక్‌ పూర్తిచేసి ఉపాఽధ్యాయుడు కావాలన్న సంకల్పంతో బీఈడీ చదువుకున్నారు. తల్లిదండ్రులు కూలీ చేసుకుని ఆ కష్టాన్ని చూసి ప్రైవేటు పాఠశాలలో చదువు చెబుతూ రోజుకు 10గంటలు పాటు కష్టపడి కొలువును సాధించారు.

30వ ర్యాంకు సాధించిన భగవంతప్ప

డీఎస్సీ ఫలితాల్లో ఆస్పరి మండలంలోని కలపరి గ్రామానికి చెందిన యువకుడు గంజల్ల భగవంతప్ప జిల్లాలో 30వ ర్యాంకు సాధించాడు. గొర్రెల కాపరిగా ఉంటూ కుటుంబానికి ఆసరాగా ఉండి చదివి ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు అభినందించారు.

శభాష్‌ పురుషోత్తం

మద్దికెర మడలం ఎడవలి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, పారిజాతమ్మ దంపతుల కుమారుడు పురుషోత్తం డీఎస్సీలో మూడు పోస్టులు సాధించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌లో జిల్లాలో 5వ ర్యాంకు, టీజీటీ జోనల్‌లో జిల్లాలో 4వ ర్యాంకు, ఎస్‌జీటీలో జిల్లాలో 17వ ర్యాంకు సాధించి మూడు పోస్టులకు అర్హులుగా ఎంపికయ్యాడు. తాను ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిచ. మద్దికెర విద్యాసాయి కళాశాలలో ఇంటర్‌ శంకరానంద కాలేజీలో డిగ్రీ టీటీసీ, తాడిపత్రిలో బీఈడీ పూర్తి చేశానన్నారు. తాను స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ సైన్స్‌) పోస్టుకు ప్రాధాన్యమిస్తానని తెలిపారు.

డీఎస్సీలో మెరిసిన అణిముత్యాలు

దేవనకొండ మండలంలోని యువకులు డీఎస్సీ ఫలితాల్లో మెరిశారు. కుంకనూరు గ్రామానికి చెందిన బసవరాజు, సుశీలమ్మ కుమారుడు హనుమంతు ఎస్‌జీటీలో 92.63 మార్కులతో జిల్లాలో మూడో ర్యాంకు సాధించాడు. అలాగే పి.కోటకొండకు చెందిన దేవరబండ వెంకటేష్‌, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర్‌ ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో 89 మార్కు లతో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాడు. అదే గ్రామానికి చెందిన పొక్కుల వెంకటేష్‌, లక్ష్మిదేవి కుమారుడు హరికృష్ణ ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో 88 మార్కులతో జిల్లా మూడో ర్యాంకు సాధించాడు.

Updated Date - Aug 24 , 2025 | 12:53 AM