నత్తనడకన రైల్వేస్టేషన్‌పునరుద్ధరణ..!
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:53 AM
కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ (రీ మోడ లింగ్) పనులు ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం. పనుల్లో నిర్లక్ష్యం.. జాప్యం కారణంగా రెండేళ్లు పూర్తయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టత లేదు.
కర్నూలు సిటీ స్టేషన్ పునరుద్ధరణకు రూ.42.62 కోట్లు
8 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం
రెండేళ్లు గడిచినా కానరాని పురోగతి
పనులను పరిశీలించిన చీఫ్ జనరల్ ఇంజనీరు రెహమాన్
కర్నూలు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ (రీ మోడ లింగ్) పనులు ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం. పనుల్లో నిర్లక్ష్యం.. జాప్యం కారణంగా రెండేళ్లు పూర్తయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టత లేదు. అమృత్ భారత్ స్టేషన్ కింద కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ఎంపిక చేశారు. రూ.42.62కోట్లతో స్టేషన్ పునరుద్ధరణ, పడమర (వెంకటరమణ కాలనీ) వైపు రెండవ ద్వారం (సెకండ్ ఎంట్రీ గేట్) నిర్మాణాల పనులు చేపట్టారు. గడువు దాటినా పూర్తికాకపోవడం, పనుల్లో జాప్యం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. పనుల పురోగతిలో వేగం పెరిగేనా..? డిసెంబరు ఆఖరులోగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నూతన అంగులు రూపుదాల్చేనా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల్లో పురోగతి నత్తతో పోటీ పడుతోంది. 2019లో రూ.28 కోట్లతో స్టేషన్ రూపురేఖలు మార్చారు. స్టేషన్ ముఖ ద్వారా అధునికీకరణ, స్టేషన్‌లో పచ్చదనం, వాహనాల పార్కింగ్, ప్లాట్ ఫారం పునరుద్ధరణ, టికెట్ కౌంటర్, ప్రయాణిలకు విశ్రాంతి గదులు, స్టేషన్ ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు.. వంటి పనులు చేపట్టారు. ప్రజాదరణ కలిగిన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం ఎంపిక చేసి ఆ స్టేషన్ల పునరు ద్ధరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2023లో రూ.42.62 కోట్లతో అదే ఏడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ వర్చూవల్ ద్వారా శంకు స్థాపన చేశారు. 8 నెలల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యం. తూర్పు వైపున ప్రధాన ద్వారం, స్టేషన్ పునరుద్ధరణతో పాటు ప్రయాణీకుల సౌకర్యం కోసం పడమర వైపు రెండవ ద్వారం (సెకండ్ ఎంట్రీ గేట్), టికెట్ కౌంటర్ నిర్మాణాలతో పాటు తూర్పు, పడమర ఎంట్రీ గేట్లను కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, రైల్వే ప్రమాణీకులు వివిధ ప్లాట్ ఫారంలో దిగేందుకు లిఫ్టులు, ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేయాలి. అయితే.. రెండేళ్లు గడిచినా 50 శాతం కూడా పనులు పూర్తికాలేదు.
ఎన్నో ఏళ్ల స్వప్నం.. సాకారంలో జాప్యం..
పడమర వైపున వెంకటరమణ కాలనీ, అశోక్‌నగర్, లేబర్ కాలనీ, సంతోష్ నగర్, బాలజీ నగర్, కప్పలనగర్.. వంటి కాలనీలు విస్తరించాయి. ఆ దిశగా నగరం రోజురోజకు విస్తరిస్తోంది. ఆయా కాలనీల ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవాలంటే అశోక్‌నగర్ దగ్గర రైల్వే లైన్ అండర్ బిడ్జి దిగువ నుంచి లేదంటే ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఐదు రోడ్ల కూడలి మీదుగా రావాలి. వర్షం వస్తే రైల్వే లైన్ అండర్ బిడ్జిలో వర్షపు నీరు నిండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేస్టేషన్ పడమర వైపు (వెంకటరమణ కాలనీ) రెండవ ద్వారం (సెకండ్ ఎంట్రీ గేట్) ఏర్పాటు చేయాలనే డిమాండ్ పాతికేళ్లుగా ఉంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం ద్వారా స్వప్నం సాకారం అవుతుందని ఆశిస్తే, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనుల్లో పురోగతి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పనులను పరిశీలించిన చీఫ్ జనరల్ ఇంజనీర్..
కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ, సెకండ్ ఎంట్రీ గేట్ నిర్మాణం పనులను సోమవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ చీఫ్ జనరల్ ఇంజనీరు రెహమాన్ పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదనల మేరకు నిర్మాణాలు చేస్తున్నారా.. లేదా..? అంటూ పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సీనియర్ సెక్షన్ ఇంజనీరు (ఎస్‌ఎస్‌ఈ) సత్యనారయణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఇంజనీర్లు ఉన్నారు. దీనిపై మహబూబ్ నగర్ ఎస్‌ఎస్‌ఈ సత్యనారయణ దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా ఈ ఏడాది డిసెంబరు ఆఖరు వరకు గడువు పొగడిం చామని తెలిపారు. ఆలోగా పనులు పూర్తి చేసి కర్నూలు రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేస్తామని తెలిపారు.