విజయవాడలో రాఘవేంద్ర స్వామి మఠం
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:39 PM
విజయవాడలో మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం నిర్మాణానికి మార్గం సుగుమం అయింది.
లబ్బీపేటలో శ్రీమఠానికి 22 సెంట్ల స్థలం కేటాయించిన ప్రభుత్వం
రూ.5.80 కోట్లు ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి
మంత్రాలయం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం నిర్మాణానికి మార్గం సుగుమం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడలో రాఘవేంద్రస్వామి మఠానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. బుధవారం మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ సురేష్ కోణాపూర్, సూపరిటెండెంట్ అనంతపురాణిక్ రిజిస్ట్రేషన్ పత్రాలను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు అందజేశారు. శ్రీమఠం చరిత్రలో కోస్తాంధ్ర ప్రాంతంలో రాఘవేంద్రస్వామి మఠాన్ని నిర్మించాలని పూర్వపు పీఠాధిపతులు ప్రయత్నించారు. ప్రస్తుత పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు సీఎం నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్‌ను కోరడంతో విజయవాడలోని ఎంజీ రోడ్, లబ్బీపేట ఏరియా, బృందావన్ కాలనీలో 11వ వార్డులో సర్వే నెం. ఎన్‌టీఎ్‌స 1242లో 1052.86 చదరపు గజాలు(22 సెంట్లు) స్థలాన్ని కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలాన్ని ప్రభుత్వం నిర్ణయించిన రూ.5.21.16,570 కోట్లకు కొనుగోలు చేసి ఈనెల 23న డాక్యుమెంట్ నెం 19994/2025తో మంగళవారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ధ్యాన్‌చంద్ రూ.53 లక్షలు రిజిస్ట్రేషన్‌కు చెల్లించి రాఘవేంద్రస్వామి మఠం పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఠాధపతి సుబుదేంద్ర తీర్థులు విజయవాడలో శ్రీమఠం నిర్మించి కోస్తాంధ్ర ఏరియా ఉండే భక్తులకు రాఘవేంద్రస్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కృషి చేసిన ఏవో మాధవశెట్టి, మేనేజర్, ఈఈ సురే్‌షకోణాపూర్, ఏఈ బద్రినాథ్, సూపర్నిండెంట్ అనంతపురాణిక్ అహర్నిశలు కృషిచేసిన అధికారులను పీఠాధిపతి అభినందించి శేషవస్త్రం ఫల, పుష్ప, మంత్రాక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. స్థల ప్రక్రియ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను డీఎం ఆనందరావు, జేపీ స్వాములకు అప్పగించారు. త్వరలో విజయవాడలో 22 సెంట్ల స్థలంలో రాఘవే ంద్రస్వామి మఠం నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.