పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:03 PM
ఎనర్జీ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సిరి గ్రీన్ కో అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ సిరి
గ్రీన్‌కో ప్రాజెక్టు పనుల పరిశీలన
ఓర్వకల్లు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎనర్జీ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సిరి గ్రీన్ కో అధికారులకు ఆదేశించారు. మంగళవారం మండలంలోని గుమ్మితంతండా వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను కలెక్టర్ సందర్శించారు. ప్రాజెక్ట్ సైట్‌లోని అప్పర్ రిజర్వాయర్, అప్పర్ ఇన్ టేక్ పాయింట్, ప్రాజెక్ట్ సైట్, పవర్ హౌస్ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనితీరు, రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి పంపింగ్ ప్రక్రియల గురించి కలెక్టర్ గ్రీన్‌కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. 1,680 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని, 4000 మెగావాట్ల సౌర, 1000 మెగావాట్ల పవన సామర్థ్యంతో కలిపి మొత్తం 6,680 మెగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని కలిగి ఎందని గ్రీన్ కో అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సందర్శన సమయంలో ఎగువ రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నప్పుడు టర్బైన్ పనిచేయడాన్ని కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలకు కట్టుబడి పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సమర్థవంతమైన భూ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వా లని, స్థానిక సమస్యలను ముందుగానే పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో గ్రీన్ కో ప్రాజెక్ట్ పీడీ శ్రీనివాసరావు, ఏపీడీ శ్రీనివాస్ నాయుడు, కర్నూలు ఆర్డీవో సందీప్‌కుమార్, ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్, సర్వేయర్ శంకర్ మాణిక్యం, ఎస్‌ఐ సునీల్‌కుమార్, విద్యుత్ ఏఈ సునీల్‌బాబు, గ్రీన్‌కో అధికారులు పాల్గొన్నారు.