నాణ్యత నగుబాటు..!
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:38 AM
తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు పర్యవేక్షణలో ఎల్లెల్సీ కాలువ ఆర్‌సీసీ లైనింగ్ పనుల్లో నాణ్యత తుంగపాలు చేశారు. నిబంధనల మేరకు సిమెంట్, ఇనుము కడ్డీలు వినియోగించకపోవడంతో ఏడాది తిరక్కుండానే రాళ్లు, కడ్డీలు తేలుతున్నాయి.
రూ.519.80 కోట్లతో తుంగభద్ర ఎల్లెల్సీ ఆర్‌సీసీ లైనింగ్
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పనులు
ఏడాది కాకుండానే కడ్డీలు తేలుతున్న వైనం
వైసీపీ హయాంలో ఓ కాంట్రాక్టర్ హవా
కూటమి ప్రభుత్వంలోనూ ఆయనదే పెత్తనం
తాజాగా మరో రూ.300 కోట్లతో లైనింగ్ పనులకు సన్నాహాలు చేస్తున్న తుంగభద్ర బోర్డు ఇంజనీర్లు
తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు పర్యవేక్షణలో ఎల్లెల్సీ కాలువ ఆర్‌సీసీ లైనింగ్ పనుల్లో నాణ్యత తుంగపాలు చేశారు. నిబంధనల మేరకు సిమెంట్, ఇనుము కడ్డీలు వినియోగించకపోవడంతో ఏడాది తిరక్కుండానే రాళ్లు, కడ్డీలు తేలుతున్నాయి. ఈ పనుల్లో బళ్లారిలో స్థిరపడిన వైసీపీ రంగు పూసుకున్న ఓ కాంట్రాక్టర్ హవా సాగుతోంది. వైసీపీ హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల అండతో ఇష్టారాజ్యంగా పనులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినా ఆయన పెత్తనమే సాగుతోందని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్లతో లైనింగ్ పనుల కోసం తుంగభద్ర బోర్డు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది చేసిన పనుల్లో నాణ్యతాప్రమాణాలు గాలికొదిలేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) కింద ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూడు నియోజకవర్గాల్లో ఖరీఫ్, రబీలో 1,51,413 ఎకరాలు సాగునీరు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు పట్టణాలు సహా 139 గ్రామాలకు తాగునీరు అందాలి. తుంగభద్ర జలాశయం నుంచి 24 టీఎంసీల నీటి వాటా ఉంది. కర్ణాటకలోని హోస్పెట్ సమీపంలో గుండ్లకేరి వద్ద 0/0 కి.మీల నుంచి ఆదోని మండలం హానవాళ్లు దగ్గర 250.86 కి.మీ.ల వరకు ప్రధాన కాలువ తుంగభద్ర బోర్డు పర్యవేక్షణలో ఉంది. కాలువ గట్టు బలహీనం కావడం, పూడిక చేరడం నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గి నీటి వాటాను కోల్పోతున్నారు. 2022-23లో తుంగభద్ర బోర్డు ఇంజీనీర్లు 115.275 కి.మీ.లు నుంచి 205.45 కి.మీ.ల వరకు రూ.519.80 కోట్లతో ఆర్‌సీసీ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. 9 ప్యాకేజీలుగా విభజించి ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో కాలువకు నీళ్లోచ్చే ముందు రాత్రి పగులు తేడా లేకుండా, ఇంజనీర్లు పర్యవేక్షణ లేకుండానే కాంట్రాక్టర్లు హడావుడిగా పనులు చేపట్టారు.
రాళ్లు, కడ్డీలు తేలిన లైనింగ్
వైసీపీ హయాంలో టీబీపీ బోర్డు పరిధిలోని ఎల్లెల్సీ సీసీ లైనింగ్ పనులు ఇష్టారాజ్యంగా చేపట్టారు. బళ్లారిలో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ రంగు పూసుకున్న ఓ బడా కాంట్రాక్టర్ పెత్తనం సాగిందని అంటున్నారు. అప్పటి కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులకు భారీగా వాటాలు ముట్టజెప్పడంతో లైనింగ్ పనులు ఎలా చేసినా అడిగేవారేలేరని కాంట్రాక్టర్లే చెబుతున్నారు. మామ్ముళ్ల మత్తులో పర్యవేక్షణ ఇంజనీర్లు చూసీచూడనట్లు ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హలహర్వి, హోళగుంద మండలాలు పరిధిలో జరిగిన ఆర్‌సీసీ లైనింగ్ పనులు పరిశీలిస్తే దారుణ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కాలువ అడుగు భాగంలో ఎర్రమట్టి వేసి గట్టిపడేలా రోలింగ్ చేసి.. దానిపై ఆర్‌సీసీ బెడ్డు వేయాల్సి ఉంటే ఎర్రమట్టితో రోలింగ్ చేయకుండానే ఉన్న కాలువను చదును చేసి లైనింగ్ వేశారు. ఇనుము (స్టీల్) 10 ఎంఎం, 8 ఎంఎం కడ్డీలు వాడాలని నిబంధనల్లో ఉంటే.. తక్కువ మంద కడ్డీలు వాడారు. సిమెంట్ వినియోగంలో పొదుపు పాటించారు. ఫలితంగా వందేళ్లు రైతన్న సేవల్లో తరించాల్సిన కాలువ లైనింగ్ పనులు ఏడాది, రెండేళ్లు గడవకనే రాళ్లు, కడ్డీలు తేలిపోవడం చూస్తే ప్రమాణాలు ఏ స్థాయిలో నీటిపాలు చేశారో తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినా.. బోర్డు పరిధిలో జరిగే పనుల్లో బళ్లారిలో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ రంగు పూసుకున్న ఓ బడా కాంట్రాక్టర్ పెత్తనమే నేటికీ కొనసాగున్నట్లు పలువురు చెబుతున్నారు. బిల్లులు చెల్లింపుల కోసం గత నెలలో ఆ కాంట్రాక్టర్‌తో అనంతపురం జిల్లాకు చెందిన కూటమి ముఖ్య ప్రజాప్రతినిధులు చర్చలు జరిపారని, 7.5 శాతం వాటాలు పుచ్చుకొని బిల్లులు మంజూరు చేశారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తుంగభద్ర బోర్డులో వైసీపీ నాయకులు, పార్టీ రంగు పూసుకున్న కాంట్రాక్టర్ల పెత్తనమే జరుగుతుండడంతో ఇదెక్కడి చోద్యం అంటూ కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుతమ్ముళ్లు ముక్కున వేలేసుకుం టున్నారు.
ఈ పనుల్లోనైనా నాణ్యత పాటిస్తారా..?
2023 జనవరిలో ఫేజ్-2 కింద ఎల్లెల్సీ, హెచ్చెల్సీ కాలువల లైనింగ్ పనులకు రూ.400 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పిలవడంలోనే నిబంధనలు ఉల్లఘించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ కాంట్రాక్టర్ తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని బళ్లారికి చెందిన ఓ కంట్రాక్టర్లు టీబీపీ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా స్పందనం శూన్యం. కూటమి ప్రభుత్వం వచ్చాక.. వైసీపీ హయాంలో పనులు చేపట్టి పనులు పురోగతి 25 శాతం కంటే తక్కువ ఉంటే ఆ పనులు రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు టీబీపీ బోర్డుకు వర్తించవని చెబుతున్నారు. ప్రస్తుతం లైనింగ్ పనులు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. తాజాగా చేపట్టే పనుల్లో బళ్లారికి చెందిన వైసీపీ కాంట్రాక్టర్‌కే ఎక్కువ శాతం పనులు ఉండడం, ఆయనకు లబ్ధి చేకూర్చేందుకే.. అనంతపురం జిల్లాకు చెందిన ముఖ్యమైన హోదాలో ఉన్న కూటమి ప్రజాప్రతినిధి ఒకరి ఒత్తిడి మేరకే బోర్డు ఇంజనీర్లు ఆ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనుల్లోనైనా నాణ్యతాప్రమాణాలు పాటించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
లైనింగ్ పనులకు సన్నాహాలు చేస్తున్నాం
కర్నూలు జిల్లాలో టీబీపీ బోర్డు పర్యవేక్షణలో ఉన్న ఎల్లెల్సీ కాలువ లైనింగ్ పనులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రూ.300 కోట్లతో ఈ పనులు చేస్తున్నాం. గత ప్రభుత్వంలోనే టెండర్లు ప్రక్రియ పూర్తయింది. నాణ్యత విస్మరిస్తే చర్యలు తీసుకుంటాం.
- నారాయణ నాయక్, ఎస్‌ఈ (ఎఫ్‌ఏసీ), తుంగభద్ర బోర్డు, హోస్పెట్