Share News

రాష్ట్రాన్ని అప్పుల పాలుచేస్తే పోరాటాలే

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:49 PM

కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయాలని చూస్తే పోరాటాలు తప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలుచేస్తే పోరాటాలే
బహిరంగ సభలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఎరుపెక్కిన పోరాటాల గడ్డ పత్తికొండ

పత్తికొండటౌన్‌, జూలై11(ఆంధ్రజ్యోతి): కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయాలని చూస్తే పోరాటాలు తప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని సీపీఐ నియోజకవర్గ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడారు. ఎన్నికల వేళ అనేక హామీలను గుప్పించారని, అధికారంలోకి వచ్చి ఏడాది ముగియగా ఏమి అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాల న్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పులు తెచ్చి సంక్షేమానికి ఖర్చు పెడుతున్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఈరాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి, శ్రీలంకగా మారుస్తాడంటూ ఎద్దేవా చేశారన్నారు. మీరు అధికారంలో ఉండి ఏమి ఉద్దరించారో సమాధానం చెప్పాలన్నారు. అదానీ లాంటి ధనవంతులకు ఖజానాను కట్టబెట్టేందుకే పాలకులు పన్నాగం పన్నుతున్నారన్నారు. ప్రతి హామీని నెరవేర్చాల్సిందేనని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న పాలకులు ప్రజా సంక్షేమాన్ని, రైతు సంక్షేమాన్ని మరిచారన్నారు. కర్నూలు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఈ జిల్లానే సస్య శ్యామలం అవుతుందన్నారు. సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్‌ అధ్యక్షతన జరిగిన ఈసభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్‌, లెనిన్‌బాబు, జిల్లా కార్యదర్శి సభ్యులు నభిరసూల్‌, రంగన్న, విరుపాక్షి, కారుమంచి, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కదం తొక్కిన ఎర్రసైన్యం

సీపీఐ నియోజకవర్గ మహాసభల సందర్భంగా ఎర్రదండు సైన్యంతో పోరాటాల గడ్డ పత్తికొండ ఎరుపెక్కింది. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శన అగ్రభాగాన డప్పుల శబ్దానికి గొరవయ్యల, లంబాడీల, చిన్నారుల కోలాటాల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వందలాది మంది మహిళలు ఎర్రచీరలు ధరించి ఎర్రజెండాలు పట్టుకుని కదిలివచ్చారు. ప్రజానాట్యమండలి ఆలపించిన విప్లవగేయాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి.

Updated Date - Jul 12 , 2025 | 11:49 PM