గ్రామపాలనలో పంచాయతీరాజ్ కీలక పాత్ర
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:36 AM
గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. గురువారం జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జడ్పీ డిప్యూటి సీఈఓ వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షతన 32వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. గురువారం జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జడ్పీ డిప్యూటి సీఈఓ వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షతన 32వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు, 1947 స్వాతంత్య్రం వచ్చినతరువాత ఉన్న పరిస్థితి చాలా వ్యత్యాసం ఉందన్నారు. 73వ సవరణకు ముందుకు స్థిరమైన ప్రామాణిక యంత్రాంగం ఉండేది కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రిజర్వేషన్లు లేవని, మహిళలకు ప్రాతినిధ్యం ఉండేదికాదన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సంఘ్వీ, బల్వంత్‌రాయ్ మెహతా తదితర కమిటీలు దేశంలో ఉన్న అత్యున్నత మేధావులు సంస్థలు అధ్యయనం చేసిన తరువాత 73వ రాజ్యంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు. ఆ చట్టాన్ని రాజ్యసభ,లోక్‌సభతో పాటు అన్ని అసెంబ్లీలో కూడ ఆమోదం చేసిన తరువాత 1993 ఏప్రిల్ 24న అమలులోకి రావడం జరిగిందన్నారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హమీ పథకం సమర్ధవంతంగా అమలు చేశామన్నారు. జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణంలో భాగంగా రూ.80 కోట్లతో 119 కి.మి. రోడ్ల నిర్మాణాన్ని కేవలం 3 నెలల్లో పూర్తి చేశామన్నారు. అనంతరం ఉత్తమ పనితీరు కనబరచిన పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు, పీఆర్ కర్నూలు ఈఈ, ఎంపిడీఓలు, ఈఓఆర్‌డీలు, పంచాయితీ కార్యదర్శులు జిల్లా పరిషత్, జిల్లా పంచాయితీ కార్యాలయం సిబ్బందికి కలెక్టర్ మెమెంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్‌ఈ వి.రామచంద్రారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, డీఎల్‌పీఓ టి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.