Share News

ప్రజాధనం... తుప్పుపడుతోంది

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:09 AM

అభివృద్దే లక్ష్యం అంటూ గొప్పలు చెప్పే పాలకుల మాటలు నీటి మూటలవుతున్నాయి. వారి నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ప్రజాధనం ‘తుప్పు’పడుతోంది.

ప్రజాధనం... తుప్పుపడుతోంది
ఆదోనిలో అసంపూర్తిగా ఆగిపోయిన మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌

ఆదోనిలో రూ.33 కోట్లతో మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌

వ్యాపారుల ‘గుడ్‌ విల్‌’ డబ్బుతో నిర్మాణానికి శ్రీకారం

పునాదులతో ఆపేసిన వైనం

‘తుప్పు’పడుతున్న పిల్లర్ల ఇనుప కడ్డీలు

పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలు, వ్యాపారులకు శాపం

అభివృద్దే లక్ష్యం అంటూ గొప్పలు చెప్పే పాలకుల మాటలు నీటి మూటలవుతున్నాయి. వారి నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ప్రజాధనం ‘తుప్పు’పడుతోంది. ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రూ.కోట్లు ప్రజా ధనంతో చేపట్టిన వివిధ నిర్మాణాలు అసంపూర్తిగా ఆగిపోయాయి. ఎండలకు ఎండుతూ.. వర్షాలకు తడిసిపోతున్న పిల్లర్ల ఇనుప కడ్డీలు నాణ్యత దెబ్బతిని పటుత్వం కోల్పోతున్నాయి. ఇందుకు నిదర్శనం ఆదోని పట్టణంలో రూ.33 కోట్లతో చేపట్టిన ‘మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌’. రాయలసీమలోనే అతిపెద్ద మున్సిపల్‌ షాపింగ్‌ కాంపెక్స్‌ అది. పట్టణానికే ఐకానిక్‌గా నిలుస్తోంది. ప్రతి పైసా వ్యాపారులు ‘గుడ్‌ విల్‌’ రూపంలో చెల్లించే డబ్బే. ఏడాదిన్నరగా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఇనుప కడ్డీలు తుప్పు పడుతున్నాయి. అందుకు ఎవరిది తప్పు..? అప్పులు చేసి గుడ్‌ విల్‌ చెల్లించిన వ్యాపారులు వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. అదే క్రమంలో అద్దె రూపంలో మున్సిపాలిటీ ఏడాదికి రూ.7-8 కోట్లకు పైగా నష్టపోతున్న తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ముంబైగా ఘనకీర్తి సొంత చేసుకున్న ఆదోని పురపాలక సంఘానికి 160ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజా ప్రతినిధుల రాజకీయ స్వార్థం.. స్వలాభాపేక్షే తప్పా ప్రజా సంక్షేమం, పట్టణ పురోగతి పట్టించుకోడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ నిధులు తీసుకురాకపోగా.. వ్యాపారుల ‘గుడ్‌ విల్‌’ డబ్బు రూ.33కోట్లతో చేపట్టిన మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు ఏడాదిన్నరగా పునాదుల్లో (ఫౌండేషన్‌ ఫూటింగ్‌) ఆగిపోయినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ఫలితంగా పిల్లర్ల నిర్మాణాల కోసం వినియోగించిన ఇనుప కడ్డీలు (స్టీల్‌) ఎండలకు ఎండుతూ.. వానాలకు నానుతూ నాణ్యత దెబ్బతింటుంది.

1.69 ఎకరాల విస్తీర్ణంలో..

పట్టణ నడిబొడ్డున ఉన్న పాతబస్టాండ్‌, రిక్రియేషన్‌ క్లబ్‌కు చెందిన 1.69ఎకరాల విస్తీర్ణంలో మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి వైసీపీ హయాంలో శ్రీకారం చుట్టారు. 366షాపులు, మూడు అంతస్తులతో నిర్మించే ఈషాపింగ్‌ కాంప్లెక్స్‌ రాయలసీమ మున్సి పాలిటీల్లో అతిపెద్దదని, పట్టణానికి ‘ఐకానిక్‌’ కాబోతుందని అంటున్నారు. ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. షాపులను బహిరంగ వేలం వేయడం ద్వారా వచ్చే ‘గుడ్‌ విల్‌’ డబ్బుతో నిర్మిణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అంచనా వ్యయం రూ.33కోట్లు ప్రజల నుం చి వచ్చేది. 2022 సెప్టంబరులో మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ టెండరు విలువ రూ.27.89కోట్లకు పనులు దక్కిం చుకొని ఒప్పందం చేసుకున్నారు.

2023లో ప్రారంభించారు. 2024లో ఆపేశారు..

2023 సెప్టెంబరులో పనులు చేపట్టారు. మూడు అంతస్తులు, నాలుగు బ్లాకుల్లో నిర్మించే ఈషాపింగ్‌ కాంప్లెక్స్‌ తొలి అంతుస్తులోని దాదాపు 76 షాపులు బహిరంగ వేలం నిర్వహిస్తే.. సుమారు రూ.16కోట్లు వరకు గుడ్‌ విల్‌ వచ్చింది. అందులో 25శాతం అంటే రూ.4కోట్లు వరకు వేలంలో షాపులు దక్కిం చుకున్న వ్యాపారులు చెల్లించారు. పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్‌ దాదాపు రూ.2.80 కోట్లు పనుల చేశారు. విద్యుత్‌ హెచ్‌టీ లైన్‌, ఎల్‌టీ లైన స్తంభాలు, తీగలు పనులకు అడ్డంగా ఉన్నాయని, వాటిని తొలగిస్తే తప్పా పనులు చేయలేనని 2024 జూన్‌ 11న కాంట్రాక్టర్‌ లేఖ రాసి పనులు ఆపేశారు. అదే సమయంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం 25శాతం కంటే తక్కువ పురోగతి ఉన్న పనులు ఆపేయాలని జీవో ఇవ్వడంతో పునాదు లతోనే ఆగిపోయింది.

మామూళ్ల కోసమేనా..?

ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీజేపీ నుంచి కూటమి అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి విజయం సాధించారు. వైసీపీ మున్సిపల్‌ పాలకవర్గం ఉం డడంతో రాజకీయ జోక్యం కారణంగా ఏడాది న్నరగా పునాదుల్లోనే ఆగిపోయింది. మాముళ్ల కోసమే ముఖ్య ప్రజాప్రతినిధి ఒకరు పనులు ఆపేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభంలో అప్పటి ముఖ్య ప్రజాప్రతినిధికి భారీగా మాముళ్లు ముట్టాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు మొదలు పెట్టేందుకు అనుమతుల కోసం భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి.

కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్‌

బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ పనులకు 8వారాల్లోగా బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. బిల్లులు చెల్లిస్తే కాంట్రాక్టరు ఆ డబ్బు తీసుకొని పను లు మొదలు పెట్టారనే కారణంతో ఇంజనీర్లు బిల్లులు చెల్లిండం లేదనే పలువురు పేర్కొంటున్నారు. ప్రజల గుడ్‌ విల్‌ డబ్బుతో నిర్మించే ఈ నిర్మాణానికి 25 శాతం జీవో వర్తించదని మున్సిపల్‌ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పనులు మొదలు పెట్టమని ప్రభుత్వం ఆదేశించినా ఆదిశగా చర్యలు శూన్యం. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి అసంపూర్తిగా ఆపేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కాగా వేలలో షాపులు దక్కించుకొని గుడ్‌విల్‌ చెల్లించిన వ్యాపారులు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా నష్టపోతు న్నామని, తక్షణమే పనులు మొదలు పెట్టాలని కోరుతున్నారు. ఈ కాంప్లెక్స్‌ పూర్తయితే అద్దె రూపేణ మున్సిపాలిటీకి ఏడాదికి రూ.7-8 కోట్లు ఆదాయం వచ్చే ఆవకాశం ఉంది.

తుప్పు పడుతున్న పిల్లర్ల ఇనుప కడ్డీలు

మూడు అంతస్తులు, నాలుగు బ్లాకుల్లో నిర్మించే ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో భాగంగా పునాదులు తీసి పిల్లర్లు నిర్మించారు. ఫౌండేషన్‌ ఫూటింగ్‌ స్థాయిలో పనులు ఆపేయడం, పిల్లర్లపైన దాదాపు 10-15అడుగుల ఎత్తు వరకు ఇనుక కడ్డీలు (స్టీల్‌) సెంట్రింగ్‌ పనులు చేసి వదిలేశారు. ఏడాదిన్నర కాలంగా ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో ఎండలకు ఎండుతూ, వర్షాలకు తుడుస్తూ స్టీల్‌ తుప్పు పట్టి నాణ్యత దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని ఇంజనీరింగ్‌ నిపుణులు అంటున్నారు. తుప్పు పట్టిన ఆ ఇనుప కడ్డీలనే ఉపయోగించి పిల్లర్లు, వాటిపై మూడు అంతస్తులు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం సాధ్యమేనా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెన్నైకు చెందిన ట్రిపుల్‌ ఐటీ కళాశాల నిపుణులతో ‘లోడ్‌ బేరింగ్‌ కెపాసిటీ’ తనిఖీ, పరీక్షలు చేయించి, వారి సూచనల మేరకు నిర్మాణాలు పునఃప్రారంభించాలని కోరుతున్నారు.

కాంట్రాక్టరుకు నోటీస్‌లు జారీ చేశాం

మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు మొదలు పెట్టమని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తక్షణమే పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌కు నోటీసు జారీచేశాం. బిల్లుల కోసం ఆయన న్యాయస్థానం ఆశ్రయిస్తే, చేసిన పనులకు బిల్లులు చెల్లించమని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. త్వరలోనే పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

కృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌, ఆదోని

Updated Date - Sep 01 , 2025 | 01:09 AM