Share News

నేడు పీటీఎం : ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:12 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే పేరెంట్‌, టీచర్‌ మీట్‌ (పీటీఎం) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

నేడు పీటీఎం : ఏర్పాట్లు పూర్తి

నంద్యాల/ కొలిమిగుండ్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే పేరెంట్‌, టీచర్‌ మీట్‌ (పీటీఎం) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను, పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ను చేపట్టింది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాకు గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలల ప్రాంగణాలను వేదికగా మార్చారు. ఈ సమావేశాల్లో విద్యార్థులే తల్లిదండ్రులను, పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను కార్యక్రమానికి ఆహ్వానించేలా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏర్పాట్ల నిర్వహణకు గాను నంద్యాల జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. పాఠశాలలో ఎన్‌రోల్‌ దామాషా పద్ధతిన ఏర్పాట్ల నిర్వహణకు నిధులను కేటాయించారు. 30మంది లోపు విద్యార్థులున్న పాఠశాలకు రూ.900, 31 నుంచి 100లోపు ఉంటే రూ.2,250, 101నుంచి 250మంది విద్యార్థులుంటే రూ.5,375, 251నుంచి 1000మంది విద్యార్థులుంటే రూ.6,750, వెయ్యికి పైగా విద్యార్థులున్న పాఠశాలలకు రూ.9వేల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, యజమాన్య పాఠశాలలు, మొత్తం 1,959 పాఠశాలలు, 96 కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం 12:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా తల్లిదండ్రులు, వీఐపీలు, అధికారులతో కలసి విద్యార్థులు సహపంక్తి భోజనం చేస్తారు.

Updated Date - Dec 04 , 2025 | 11:12 PM