Share News

పీటీఎం పండుగ

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:44 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి(పీటీఎం) అపూర్వ స్పందన కనిపించింది.

పీటీఎం పండుగ
విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను పరిశీలిస్తున్న కలెక్టర్‌, డీఈవో

3.0 మెగా కార్యక్రమానికి అపూర్వ స్పందన

విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత: కలెక్టర్‌ సిరి

కర్నూలు/ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి(పీటీఎం) అపూర్వ స్పందన కనిపించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో పండుగ వాతావరణం కనిపించింది. పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు అధికారులు, పూర్వ విద్యార్థులు, గతంలో పని చేసిన ఉపాధ్యా యులు, అధ్యాపకులు సమావేశానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌, సమగ్ర శిక్ష ఏపీసీ లోక్‌రాజ్‌ గత వారం రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 2.60 లక్షలు, విద్యార్థులు అన్ని జూనియర్‌ కళాశాలల్లో 46వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల్లో ఆటల పోటీలు, మ్యూజికల్‌ చైర్స్‌, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ ఆధ్వర్యంలో సహపంక్తి భోజనంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

విద్యారంగానికి పెద్దపీట..

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సుస్థిర సమ న్వయం కోసం మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ 3.0ను ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి పేర్కొన్నారు. స్థానిక చెన్నమ్మ కల్లూరు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌లో ప్రధానోపాధ్యాయులు డీసీ హుశేన్‌ అధ్య క్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన సేంద్రియ వ్యవసాయం, రిచ్‌ విటమిన్‌ కార్డెన్‌, పునరుత్పాదక ఇంధన పార్కు, వాక్యూమ్‌ క్లీనర్‌ సైన్స్‌ ఎగ్జిబిసన్‌ ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులపై గురువుల బాధ్యత ఎంత ఉందో.. తల్లిదండ్రులపై అంతే పాత్ర కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ఫ్రా స్టక్చర్‌ డైరెక్టర్‌ నాగమణి, ఎంఈవో వనజ, పాఠశాల చైర్మన్‌ మహబూబ్‌ బాషా, ప్రధానోపాధ్యాయులు, డీసీ హుశేన్‌ పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా 4,18,381 మంది హాజరు

విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌-3.0 కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలో 1,445 పాఠశాలల్లో పండుగ వాతావరణంలో ఈ సమావేశాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,445 పాఠశాలల్లో జరిగిన సమావేశాల్లో 2,10,755 మంది విద్యార్థులు, 78,457 మంది తల్లులు, 67,355 మంది తండ్రులు, 10,325 మంది ఉపాధ్యాయులు, 17,974 మంది పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు హాజరయ్యారు. వీరితో పాటుగా 2,111 మంది ప్రజా ప్రతినిధులు, 1,751 మంది అధికారులు, 1,529 మంది దాతలు, 2,395 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు 24,037 మంది, పూర్వ విద్యార్థులు 1,692 మంది కలిపి 4,18,381 మంది ఒకే రోజు సమావేశాలకు హాజరు కావడం రాష్ట్రస్థాయిలోనే సరికొత్త రికార్డు అని డీఈవో శామ్యూల్‌పాల్‌ తెలిపారు.

Updated Date - Dec 05 , 2025 | 11:44 PM