శ్రీశైలం పవిత్రతను కాపాడండి
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:20 PM
: శ్రీశైలం పవిత్రతను ధర్మకర్తల మండలి కాపాడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన క్షేత్రం శ్రీశైలం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్
సామాన్యులకు స్పర్శ దర్శనం కలిగిస్తాం:
ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షుడు రమేష్‌నాయుడు
ఘనంగా ప్రమాణ స్వీకారం
శ్రీశైలం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం పవిత్రతను ధర్మకర్తల మండలి కాపాడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సోమవారం శ్రీశైలంలో చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విలేకరులతో మాట్లాడుతూ జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలిసినది శ్రీశైల క్షేత్రం అని అన్నారు. ఉమ్మడి కడప జిల్లాల్లో ఒక ఎన్‌జీవోను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించిన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షుడిగా ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. నూతన ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలిపారు.
చెంచులకు అంకితం
తనకు వచ్చిన ధర్మకర్తల మండలి అధ్యక్షుడి పదవిని చెంచులకు అంకితం చేస్తానని శ్రీశైలం ధర్మకర్తల మండలి కొత్త చైర్మన్ రమేష్‌నాయుడు అన్నారు. దేవస్థానం తరుపున చెంచులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, సామాన్య భక్తులకు కూడా స్పర్శదర్శనం కలిగేలా కృషి చేస్తామన్నారు. తనను చైర్మన్‌గా ఎన్నిక చేసిన సీఎం నారా చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 16వ తేదీన నరేంద్ర మోదీ శ్రీశైలంకు వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగం చెప్పి ఆలయాభివృద్ధి కోసం ధర్మకర్తల మండలి సభ్యుల తరఫున వినతిపత్రంను అందజేస్తామన్నారు.
స్వామి, అమ్మవార్లకు పూజలు
శ్రీశైల దేవస్థానంలో ముందుగా అర్చకులు స్వామి, అమ్మవార్లకు పూజలు చేయగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా రమే్‌షనాయుడు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు రమణ, బి.రమణమ్మ, జి.లక్ష్మిశ్వరి, కె.కాంతివర్ధిని, ఎస్.పిచ్చయ్య, దేవకీ వెంకటేశ్వర్లు, జె.రేఖాగౌడ్, ఎ.అనిల్‌కుమార్, డి.వెంకటేశ్వర్లు, బి.వెంకటసుబ్బారావు, సి.హెచ్.కాశీనాధ్, యం.మురళీధర్, యు.సుబ్బలక్ష్మి, పి.యు.శివమ్మ, జి.శ్రీదేవితో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన పలువురు సభ్యులు కూడా ఈకార్యక్రమానికి హాజరయ్యారు. సభ్యులందరికీ వేద ఆశీర్వచనాలతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, చిత్రపటాన్ని ఈవో శ్రీనివాసరావు అందజేశారు. సభ్యులుగా ఎన్నికైన చిట్టిబోట్ల భరద్వాజ శర్మ, గుల్ల గంగమ్మ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని ప్రమాణ స్వీకారినిక పిలువకపోవడంతో తమకు బాధ వేసిందని గుల్ల గంగమ్మ పేర్కొన్నారు.