జడ్పీలో పదోన్నతుల జాతర
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:16 AM
జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల జాతర కొనసాగుతోంది.
35 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా అవకాశం
26 సంవత్సరాల తరువాత అత్యధిక సంఖ్యలో ప్రమోషన్లు
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల జాతర కొనసాగుతోంది. ఇటీవల 32 మంది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించారు. అదే విధంగా వాటిని భర్తీ చేసేందుకు 35 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఇంత పెద్ద సంఖ్యలో పదోన్నతులు రావడం చాలా సంవత్సరాల తరువాత జరిగిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1999 అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 54 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులు లభించాయి. 26 సంవత్సరాల తరువాత మళ్లీ కూటమి ప్రభుత్వం హయాంలో ఉపముఖ్య మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ చొరవతో ఇంత మందికి పదోన్నతులు రావడంపై ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్లను భర్తీ చేసేందుకు త్వరలోనే ల్యాబ్, లైబ్రరీ, రికార్డు అసిస్టెంట్లు సుమారు 35 మందికి పదోన్నతుల ప్రక్రియను జడ్పీ అధికారులు ప్రారంభించారు. ఈ నెలాఖరులోగా పదోన్నతులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.