Share News

ఉల్లి రైతుకు.. కన్నీటి కష్టాలు!

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:00 AM

ఉల్లి రైతును కష్టాలు చుట్టుముట్టాయి. కాయకష్టం చేసి, చేతిలో ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టి.. పండించిన పంటను ఏం చేసుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. మార్కెట్లో చూస్తే ఉల్లి బస్తాలు గుట్టలుగా పడి ఉన్నాయి

ఉల్లి రైతుకు..  కన్నీటి కష్టాలు!
బారులుతీరిన ఉల్లిగడ్డల వాహనాలు

మార్కెట్లో గుట్టలుగా నిల్వలు, రోడ్డుపై వాహనాల బారులు

‘ఉచిత’ ప్రచారంతో ఎత్తుకుపోయిన జనం

కర్నూలు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతును కష్టాలు చుట్టుముట్టాయి. కాయకష్టం చేసి, చేతిలో ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టి.. పండించిన పంటను ఏం చేసుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. మార్కెట్లో చూస్తే ఉల్లి బస్తాలు గుట్టలుగా పడి ఉన్నాయి. రోడ్డుపై ఇంకా ఉల్లి లోడులతో వాహనాలు వస్తూనే ఉన్నాయి. మార్కెట్లో కుళ్లిపోయిన ఉల్లిని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ... ఇదంతా ఒక ఎత్తయితే.. ఉల్లి గడ్డలను ఉచితంగా ఇచ్చేస్తున్నారనే ప్రచారం ఎలా జరిగిందో ఏమో.. స్థానిక జనం ఆటోలు, బైక్‌లపై వచ్చి మార్కెట్లో ఉన్న బస్తాలను ఎత్తుకు పోయారు. మన రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా, కర్ణాటకలోని రాయచూరు జిల్లాల నుంచి కూడా రైతులు పండించిన ఉల్లి దిగుబడులు అమ్మకానికి కర్నూలు మార్కెట్‌కు వస్తున్నాయి. ఒక్క కర్నూలు జిల్లా నుంచే ఈ సీజన్‌లో 15.50 లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చిందని అధికారుల అంచనా. ఇది కాకుండా నంద్యాల, అనంతపురం, కడప తదితర జిల్లాల నుంచి కూడా రైతులు అమ్మకానికి దిగుబడులు భారీగా తీసుకొస్తున్నారు. గతేడాది క్వింటా రూ.5 వేల వరకు ధర పలికితే, ఈ ఏడాది క్వింటా రూ.350 నుంచి రూ.500లకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 మద్దతు ధర ప్రకటించి ఏపీ మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం రైతులకు ఊరట ఇచ్చింది. ఏపీ మార్క్‌ఫెడ్‌ 60,057 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. అందులో 3,423 టన్నులు మాత్రమే రాష్ట్రంలోని రైతు బజార్లు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయగా, మిగిలిన 2,631 టన్నుల పంటను మార్కెట్‌లో నిల్వ చేశారు. వ్యాపారులు కొనుగోలు చేసిన 6,202 టన్నుల్లో సగం మార్కెట్‌ యార్డులోనే ఉండిపోయింది. యార్డులో ఉన్న ఉల్లి గడ్డలు కుళ్లిపోవడంతో దాదాపు వంద క్వింటాళ్లకుపైగా డంపింగ్‌ యార్డుకు తరలించారు. ఏ ప్లాట్‌ఫారంపై చూసినా ఉల్లి బస్తాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. మరోవైపు రైతులు భారీ ఎత్తున ఉల్లి పంటను మార్కెట్‌కు తెస్తున్నారు. మార్కెట్‌ అంతా నిండిపోవడంతో ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితి ఉంది. మంగళవారం రైతులు భారీ ఎత్తున ఉల్లి దిగుబడులు అమ్మకానికి మార్కెట్‌కు తీసుకొచ్చారు. కాగా, ఉల్లిగడ్డలు ఉచితంగా ఇస్తారని పరిసర కాలనీవాసులకు ఎవరు సమాచారమిచ్చారో తెలియదు. ఆటోలు, బైకులపై వచ్చి వ్యాపారులు, రైతులు మార్కెట్‌లో ఉంచిన ఉల్లి బస్తాలను ఇష్టారాజ్యంగా తీసుకెళ్లారు. ఆటోలు, బైకులపై వచ్చి ఉల్లి బస్తాలు ఎత్తుకెళ్లారు. ఈ పరిస్థితిని చూసి ఉల్లి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. జేసీ బి.నవ్య మార్కెట్‌ను తనిఖీ చేసి, పోలీసులను రప్పించడంతో ఉల్లి బస్తాలు తీసుకువెళ్తున్న వారిని అడ్డుకున్నారు. కాగా, ఇంతవరకు కొనుగోలు చేసిన ఉల్లికిగాను రైతులకు ఏపీ మార్క్‌ఫెడ్‌ రూ.7.26 కోట్లు ఇవ్వాల్సి ఉంటే రూ.1.54 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.5.72 కోట్లతోపాటు వ్యాపారులు కొనుగోలు చేసిన ధరపై వ్యత్యాసం 6,202 టన్నులకు రూ.5.22 కోట్లు కలిపి రూ.10.94 కోట్లు ఉల్లి రైతులకు చెల్లించాల్సి ఉంది. తక్షణమే చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Updated Date - Sep 17 , 2025 | 01:00 AM