సర్టిఫికెట్ల పరిశీలనకు సన్నాహాలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:17 AM
ఎన్నో ఏళ్లు తరువాత కూటమి ప్రభుత్వం డీఎస్సీ-2025 నిర్వహించింది. శుక్రవారం రాత్రి మెరిట్ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది.
రాయలసీమ వర్సిటీ, శ్రీరాఘవేంద్ర, శ్రీనివాస్ బీఎడీ కళాశాలల్లో కేంద్రాలు
54 బందాల ఏర్పాటు
డీఎస్సీ అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలి
సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్ మేరకు పరిశీలనకు హాజరు కావాలి
కర్నూలు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లు తరువాత కూటమి ప్రభుత్వం డీఎస్సీ-2025 నిర్వహించింది. శుక్రవారం రాత్రి మెరిట్ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. కాబోయే గురువులు ఎవరో ఇప్పటికే తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉండాలి. తక్కువ సమయం ఉండడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎంపికైన అభ్యర్థులు తమ సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్ వివరాల మేరకు సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని విద్యా శాఖ అధికారులు తలిపారు. అలాగే.. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు విద్యార్హత, కుల, ఆదాయం, స్థానికత(నేటివిటీ), దివ్యాంగులైతే వారి అర్హత ధ్రువపత్రాలు (సర్టిఫికెట్లు) పరిశీలన ఉంటుంది. ఎంతో కష్టపడి పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఏ ఒక్క సర్టిఫికెట్ చూపించకపోయినా చిక్కుల్లో పడడమే కాదు.. ఉద్యోగమే కోల్పొయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో ఏఏ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేశారో.. ఆ సర్టిఫికెట్లు పరిశీలనలో తప్పకుండా చూపించాలని కర్నూలు జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.శ్యామ్యూల్ పాల్ ఆంధ్రజ్యోతికి వివరించారు.
ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, గణితం, సాంఘిక శాస్త్రం (షోషియల్ స్టడీస్), ఎస్జీటీ టీచర్లు, పీఈటీలు, టీజీటీ ఇంగ్లీష్.. ఇలా వివిధ సబ్జెక్టుల్లో 2,645 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 నిర్వహించింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఖాళీలు ఉండడంతో జిల్లా నుంచే కాకుండా నాన్ లోకల్ కేటగిరీలో ప్రతిభ చూపిపేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసి పరీక్షలు రాశారు. 53,787 మంది అభ్యర్థులు మెరిట్ జాబితా వచ్చింది. వీరిలో రిజర్వేషన్లు ప్రకారం ఒక్కొ పోస్టుకు ఒకరిని చొప్పున 2,645 మంది రేపటి ఎంపికైన అభ్యర్థులు (సెలెక్టెడ్ లిస్ట్) జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసి అభ్యర్థులకు నేరుగా మెసేజ్‌లు పంపుతున్నట్లు తెలిసింది. విద్యాశాఖ నుంచి మెసెజ్ మేరకు అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకొని.. మెసేజ్‌లో పేర్కొన్న తేది, సమయంలో సబంధిత పరిశీలన కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ల పరిశీలనకు 54 బృందాలు
ఎస్జీటీ అభ్యర్థులకు కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎస్జీటీ అభ్యర్థులకు, నన్నూరు సమీపంలో మారుతి ఎస్టేట్ శ్రీరాఘవేంద్ర బీఎడ్ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) లాంగ్వేజ్ అభ్యర్థులకు, నన్నూరు సమీపంలో మారుతీ ఎస్టేట్-2లో ఉన్న శ్రీనివాస బీఎడ్ కళశాలలో స్కూల్ అసిస్టెంట్ నాన్-లాంగ్వేజ్ అభ్యర్థులకు పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేశారు. 54 బృందాలను ఎంపిక చేశారు. ఒక్కో బృందంలో మండల విద్యా అధికారి (ఎంఈవో), ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ సహసీల్దారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ఆరు బృందాలను ఒక బ్లాక్‌గా విభజించి, ప్రతి బ్లాక్‌కు సాంఘిక సంక్షేమం, బీసీ, ఎస్టీ, సైనిక్ సంక్షేమ శాఖ ప్రతినిధులు కూడా ఉంటారు. దివ్యాంగుల అభ్యర్థులు వారి అంగవైకల్యం నిర్ధారణ కోసం మెడికల్ బోర్డుకు పంపుతారు. వినికిడి లోపం కలిగిన వారిని విశాఖ పంపించి ధ్రువీకరిస్తారని డీఈవో తెలిపారు. పరిశీలన కేంద్రాల్లో ఏర్పాట్లను ఆదివారం డీఈవో శ్యామ్యూల్‌పాల్ తనిఖీ చేశారు. పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేసిన వర్సిటీ క్యాంపస్‌లోకి అభ్యర్థితో పాటు సహాయకుడు ఒకరిని అనుమతిస్తారు. అవసరమైన తాగునీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి
విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.8లక్షలలోపు ఆదాయం ఉన్నట్లు ధ్రువీకరించే ఆదాయ ధ్రువపత్రంతో పాటు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు వారి సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆ తేదిన తేది, సమయానికి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేసి, ఆ తరువాత మెరిట్ ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలను పిలుస్తారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉండడంతో అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లతో నిర్దేశించిన తేదీన హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు.