పొట్టి శ్రీరాములు త్యాగం అనిర్వచనీయం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:27 PM
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల కల్చరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా నంద్యాల సంజీవనగర్ గేట్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. స్వార్ధంలేని సేవాభావంతో, దేశభక్తితో ఆయన చేసిన త్యాగంనేటి తరాలకు ఆదర్శమన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పొట్టి శ్రీరాములు చేసిన మహోన్నత త్యాగాన్ని ఎప్పటీకీ మర్చిపోకూడదని మంత్రి పిలుపునిచ్చారు. కలెక్టర్ రాజకుమా రి మాట్లాడుతూ అహింస, సేవ, సత్యం, సామాజిక న్యాయం వంటి విలువలతో అమరణ నిరాహార దీక్ష చేసి, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరామలు అన్నారు. వారి త్యాగ ఫలితంగానే 1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.