పోస్టాఫీసు కిట..కిట
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:12 AM
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో నగదును జమ చేసింది.
కర్నూలు న్యూసిటీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో నగదును జమ చేసింది. ప్రధానంగా బ్యాంకు ఖాతాతో పాటు పోస్టాఫీసు ఖాతాలో కూడా నగదు జమ చేశారు. దీంతో మంగళవారం కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో తల్లులు తమ ఖాతాల్లోని నగదును డ్రా చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా 3,67,614 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.477.90 కోట్లు జమ చేసింది. 2,16,181 తల్లుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్కో ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉంటే రూ.65 వేలు కూడా జమ అయింది. ప్రధానంగా మహిళలకు అత్యధికంగా పోస్టాఫీసులో ఖాతా ఉండటంతో వేలాదిగా తరలివచ్చారు. నగదు డ్రా చేసుకునే సమయంలో పోలీసులు మహిళలను నియంత్రించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు డ్రా చేసుకున్న అనంతరం తల్లులు పిల్లలకు బ్యాగులు, పుస్తకాలతో పాటు బంగారు, బట్టలు కొనుగోలు చేశారు.