కాలుష్య భూతం
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:09 AM
నగరాన్ని వాయు కాలుష్య భూతం వెంటాడుతోంది. కర్నూలు మరో ఢిల్లీ నగరం కాక ముందే పాలకులు మేల్కొంటారా? సందేహమే
నగరాన్ని చుట్టుముడుతున్న వాయు కాలుష్యం
శాశ్వత చర్యలు పట్టని పాలకులు
భవిష్యత్తు ఆందోళనకరం
నగరాన్ని వాయు కాలుష్య భూతం వెంటాడుతోంది. కర్నూలు మరో ఢిల్లీ నగరం కాక ముందే పాలకులు మేల్కొంటారా? సందేహమే. వాయు కాలుష్యంపై అధ్యయన నివేదికలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. పెరుగుతున్న నగరీకరణ, భవన నిర్మాణ వ్యర్థాలు, ఇంధన వాహనాల వినియోగం, రహదారులపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఒక ఎత్తయితే, చెత్త, చెక్క వ్యర్థాలను తగలపెట్టటం వల్ల వచ్చే కాలుష్యం మరో ఎత్తు. వీటి వల్ల సల్ఫర్‌డయాక్సైడ్, నైట్రోజన్‌డయాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు వెలువడుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో ఓర్వకల్లు ప్రాంతం పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందితే నగర కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యం లేదు.
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): గత దశాబ్ద కాలంపైగా వాయు నాణ్యత సూచీని పరిశీలిస్తే హెచ్చుతగ్గులు స్పష్టంగా అగుపిస్తున్నాయి. వాయు నాణ్యత సూచీలో పీఎం 10(పార్టిక్యులేట్ మ్యాటర్)ను మైక్రోగ్రాముల్లో కొలుస్తారు. నగరంలో పీఎం 10 నిర్దేశిత లక్ష్యం, 60లోపు ఉండాలి. 2011 నుంచి 2015 వరకు వరుసగా 82, 74, 76, 77, 82గా నమోదు అయ్యాయి. ఒక్క కరోనా సమయం నుంచి మాత్రమే పీఎం 10లో కొంత మెరుగుదల కన్పించింది.. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా జన సంచారం ఎక్కువగా లేకపోవటం, వాహనాల వినియోగం తక్కువగా ఉండటం వల్ల పీఎం 10 విలువ 52, 58గా నమోదు అయింది. వార్షిక గణాంకాలతో పాటు నెలవారీ గణాంకాలను చూస్తే ప్రతి ఏటా వేసవిలో అత్యధికంగా వాయు కాలుష్యం ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో వాయు నాణ్యత సూచీ 65గా నమోదైంది. కానీ శీతాకాలంలో కొంత తగ్గాల్సి ఉండగా..నవంబరు, డిసెంబరుల్లో ఇది ఊహించిన దాని కంటె అత్యధికంగా నమోదు కావటం ఆందోళన కల్గించింది. ఈ రెండు మాసాల్లో వాయు నాణ్యత సూచిలో 83, 77గా నమోదు అయింది. దీపావళి సందర్భంగా పెద్ద మొత్తంలో బాణసంచా కాల్చటం వల్ల వాతావరణంలో మార్పులు జరిగి కాలుష్య తీవ్రత అధికంగా నమోదు అయినట్లు నిపుణులు అంచనా వేశారు. 2025 అర్థ సంవత్సరాన్ని పరిశీలిస్తే ఈ గణాంకాలు మరీ దారుణంగా ఉన్నాయి. పీఎం 10 విలువ 74గా నమోదు అయింది. వేసవి కాలంలో రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి పైకి లేవటం వల్లనే గణాంకాలు భారీగా నమోదు అయినట్లు తెలుస్తున్నా, జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి తీవ్రంగా ఉన్నా, వర్షాలు మొదలయ్యాక కూడా కాలుష్య తీవ్రత ఎక్కువగా నమోదు కావటం ఆశ్చర్యంగా ఉంది.
సర్దుబాటు సరే.. దిద్దుబాటు ఏదీ?
వాయు కాలుష్య నియంత్రణకు ఎప్పటికప్పుడు తాత్కాలిక సర్దుబాటు చర్యలు తీసుకుంటున్నారే తప్ప, శాశ్వత దిద్దుబాటు చర్యలు చేపట్టటం లేదనే అపవాదు ఉంది.. నగరంలోని రాజ్‌విహార్ కూడలి, వెంకటరమణ కాలనీ, కల్లూరు పారిశ్రామికవాడ, క్రిష్ణానగర్ ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీలను ఏర్పాటు చేసి గణాంకాలను నమోదు చేస్తున్నారు. త్వరలోనే ఆశోక్‌నగర్ వాటర్ వర్క్స్ ఆవరణలో నిరంతర వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడక్కడ రహదారుల విస్తరణ చేపడుతున్నారు. ఇవన్నీ తాత్కాళిక ఉపశమన చర్యలే. కానీ శాశ్వత నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి, ఇంధన వాహనాలను స్థానంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాలను ప్రోత్సాహించాలి. ప్రజారవాణాను సైతం మరింత మెరుగపరచాలి. ప్రజలను భాగస్వామ్యులను చేసి అవగాహన కల్పించాలి. అనుబంధ శాఖలైన కాలుష్య నియంత్రణ, రవాణా, పరిశ్రమలు, స్థానిక సంస్థల సహకారంతో ఉమ్మడి కార్యదళాలను ఏర్పాటు చేయాలి. సాంకేతికతను వినియోగించి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి.
ప్రోత్సాహక నిధులు అందేనా?
గతేడాది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం(ఎన్‌క్యాప్) కింద రూ.8.83 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వీటిని నగరంలోని రహదారుల విస్తరణకు వెచ్చిస్తున్నారు. ఎండ్ టు ఎండ్ రహదారుల ఏర్పాటు వల్ల వాతావరణంలో దుమ్ము తగ్గి, కాలుష్య నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటుందని అధికారుల ఆలోచన. వీటితో పాటు కలెక్టరేట్, నగరపాలక సంస్థ, నంద్యాల చెక్‌పోస్టు వంటి ఎనిమిది ప్రధాన కేంద్రాల్లో ఎన్‌క్యాప్ నిధులతో వాయు నాణ్యత సూచీ ఫలకాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటి వల్ల కాలుష్య తీవ్రత పట్ల ప్రజల్లో చైతన్యం వస్తోందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ఎన్‌క్యాప్ నిధులను సాధించాలంటే పీఎం 10 విలువ 54 సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ అర్థ సంవత్సరం అధ్యయన నివేదికలను చూస్తుంటే.. ఈ సంవత్సరం ఈ ప్రోత్సాహక నిధులు కష్టమేనన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ ఆరు నెలల్లో ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడితే ఈ ఏడాది మరో రూ.10 కోట్ల ఎన్‌క్యాప్ నిధులు పొందే అవకాశం ఉంది.
పర్యావరణ హిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి:
కాలుష్య నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. వాహనాల వినియోగంలో విద్యుత్, వాయు ఆధారిత వాహనాల పట్ల మొగ్గు చూపాలి. అధిక కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలను వాడరాదు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసి కాల్చరాదు. మట్టి ప్రతిమలను పూజించాలి. గ్రీన్ క్రాకర్స్ కాల్చాలి. నార సంచులను వాడాలి. ఇలాంటి పర్యావరణ హిత కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. అప్పుడే కాలుష్య సమస్యను నియంత్రించగలం.
పీవీ కిషోర్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ఇంజనీరు