పాలిసెట్ కౌన్సెలింగ్‌కు వేళాయె
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:25 AM
రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్-2025 అర్హత సాధించిన విద్యార్థులకు శనివారం నుంచి 28వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు పూర్తిచేశారు.
నేటి నుంచి 28 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన
ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల హెల్ప్ డెస్కులు
ఆదోని అగ్రికల్చర్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్-2025 అర్హత సాధించిన విద్యార్థులకు శనివారం నుంచి 28వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు పూర్తిచేశారు. అర్హత సాధించినవారు ర్యాంకుల వారిగా ప్రవేశ రుసుము చెల్లించి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఆదోని ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ చెన్నపు రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కర్నూలు బి.తాండ్రపాడు ఎస్‌జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆదోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బనగానపల్లె పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే కౌన్సెలింగ్ కోసం సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలుగా నిర్ణయించారు. అందుకు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కౌన్సెలింగ్ జరగనుంది.
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు
ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో పాల్గొనేవారు ప్రాసెసింగ్ ఫీజు రసీదు పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి మార్క్సు లిస్ట్, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు తీసుకురావాలి. స్టడీ సర్టిఫికెట్ సమ ర్పించే అవకాశం లేనివారు తహసీల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2025-26 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ధ్రువీ పత్రం తీసుకురావాలి. 2022 జనవరి 1వ తేది తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే అనుమతి స్తారు. టీసీ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి.
నాలుగు సెంటర్లలో కౌన్సెలింగ్
ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాలోని 4 కళాశాలల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. 21వ తేదీన 1వ ర్యాంకు నుంచి 15వేల వరకు, 22న 15,001 నుంచి 32,000 వరకు, 23న 32,001 నుంచి 50,000 వరకు, 24న 50,001 నుంచి 68,000 వరకు ర్యాంకు వచ్చిన వారికి సరిఫికెట్ల పరిశీలన ఉంటుంది. అలాగే 25న 68,001 నుంచి 86,000 వరకు, 26న 86,001 నుంచి 1,04,000 వరకు, 27న 1,04,001 నుంచి 1,20,000 వరకు, 28న 1,20,001 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు గడవు ఇచ్చారు. ఈనెల 25, 26వ తేదీల్లో 1 నుంచి 50వేల ర్యాంకు వరకు, 27, 28వ తేదీల్లో 50,001 నుంచి 90,000 ర్యాంకు వరకు, 29, 30వ తేదీల్లో 90,001వ ర్యాంకు నుంచి చివర వరకు వెట్ ఆప్షన్లు ఇవ్వాలి. జూలై 1వ తేదీన వెబ్ ఆప్షన్లకు మార్పులు చేర్పులు, 3న కళాశాలలు, బ్రాంచ్ కేటాయింపు వివరాలను విడుదల చేస్తారు.
ఫీజు ఇలా
పెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి 30వ తేదీ వరకు విద్యార్థులకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. జూలై 1న అంతకు ముందు ఇచ్చిన ఆప్షన్‌ను మార్పుకోవచ్చు. 3న సీట్ల కేటాయింపులు ఉంటాయి. అలాగే, ఓసీ, బీసీ విద్యార్థులు కౌన్సెలింగ్ ఫీజు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 ఆన్‌లైన్‌ల్లో చెల్లించాల్సి ఉంటుంది.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఏర్పాట్లను పూర్తి చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్నూలు, ఆదోని, నంద్యాల, బనగాలపల్లె పాలిటెక్నిక్ కళాశాలల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలనకు తీసుకు రావాల్సి ఉంటుంది. - సి.చిన్నపురెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆదోని