దంపతుల ప్రాణాలు కాపాడారు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:21 AM
అప్పులబాధ తాళలేక బనగానపల్లె పట్టణ సమీపంలోని ఎస్సార్బీసీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించిన దంపతులను బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి, పోలీస్ సిబ్బంది కాపాడిన ఘటన సోమవారం జరిగింది
ఎస్సార్బీసీ కాలువలో దూకడానికి భార్యాభర్తల నిర్ణయం
రక్షించిన పోలీసులు
బనగానపల్లె, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): అప్పులబాధ తాళలేక బనగానపల్లె పట్టణ సమీపంలోని ఎస్సార్బీసీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించిన దంపతులను బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి, పోలీస్ సిబ్బంది కాపాడిన ఘటన సోమవారం జరిగింది. వివరాలివీ.. కడప జిల్లా మైదుకూరు సమీపంలోని జంగంపల్లె గ్రామానికి చెందిన మద్దిలేటి, శశికళ దంపతులు అవుకు మండలంలోని రామాపురం గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అప్పులు అధికం కావడంతో జీవితంపై విరక్తి చెంది బనగా నపల్లె సమీపంలోని రవ్వలకొండ సమీపంలోని ఎస్సార్బీసీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. కాలువలో దూకే ముందు శశికళ తన సమీప బంధువు చిన్నమద్దిలేటికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆయన వెంటనే బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసి తన అన్న, వదిన ఆత్మహత్య చేసుకో బోతున్నారని సీఐ ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ దుగ్గిరెడ్డిని, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా సహకారంతో లొకేషన్ ద్వారా బనగానపల్లె ఎస్‌ఐ దుగ్గిరెడ్డి, పోలీస్ సిబ్బంది నాగచంద్రుడు, రమణయ్య బనగానపల్లె పట్టణ సమీపంలోని రవ్వలకొండ వెళ్లే మార్గంలోని ఎస్సార్బీసీ కాలువ వంతెనపై దంపతులు ఉన్నట్లు గుర్తించారు. అక్కడి వెళ్లి దంపతులను బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్ వద్దకు తీసుకు వచ్చి విచారించారు. తమకు రూ.3 లక్షల అప్పు ఉందని, ఆ అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకున్నట్లు దంపతులు తెలిపారు. దంపతు లిద్దరికీ సీఐ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ దుగ్గిరెడ్డిని, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, డోన్ డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.