ఏసీబీ వలలో పోలీస్
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:38 AM
కర్నూలు నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడు, హెడ్ కానిస్టేబుల్ రవి రూ.80వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
రూ.లక్ష డిమాండ్
రూ.80వేలకు కుదిరిన బేరం
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్
తప్పుడు కేసును కోర్టుకు రెఫర్ చేసేందుకు లంచం
డీఎస్పీ శ్రీనివాసాచారి సమక్షంలో విచారణ
సీఐ మధుసూదన్‌గౌడు ప్రధాన నిందితుడు
ఏసీబీ డీఎస్పీ సోమన్న వెల్లడి
కర్నూలు క్రైం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడు, హెడ్ కానిస్టేబుల్ రవి రూ.80వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేయగా సీఐ మధు సూదన్‌గౌడు తాను నేరుగా కాకుండా హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ద్వారా బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కొత్తబస్టాండు ఎదురుగా ఉన్న నిర్మల హోటల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాలు.. బాధితులు బెస్త రఘు, బెస్త రవి నుంచి హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ రూ.80వేలు లంచంను నేరుగా తీసుకున్నాడు. తాను సీఐ మధుసూదన్‌గౌడు సూచనల మేరకే తీసుకున్నానని చెప్పడంతో ఏసీబీ అధికారులు సీఐని కూడా అదుపులోకి తీసుకున్నారు.
మైదా పిండితో మొదలైన వైరం
స్థానిక బీ.క్యాంపు చెందిన బెస్త రఘు, బెస్త రవి గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఓ బేకరి నిర్వహిస్తున్నారు. వీరికి చలపతి అనే వ్యాపారి మైదాపిండి సరఫరా చేస్తుంటాడు. 2023లో మైదాపిండి సరియైున క్వాలిటీ లేకపోవడంతో వీరి మధ్య వైరం నెలకొంది. ఆ ఏడాదే చలపతి, మరో ఇద్దరు మిత్రులు నాగేంద్రబాబు, శ్రీనివాసులుతో కలిసి బెస్త రఘుపై దాడిచేశారు. బెస్త రఘు వీరి ముగ్గురుపైన నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులకు బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఆ కేసు కోర్టులో ఉండగానే మైదాపిండి వ్యాపారి చలపతి న్యాయవాది కృష్ణారెడ్డి ద్వారా బెస్త రఘుపై కేసు నమోదుచేయాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సూచనల మేరకు 2024 జూన్ 3న బెస్త రఘుపై అప్పటి సీఐ శంకరయ్య కేసు నమోద చేశారు. తనపై దాడిచేశాడని చలపతి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసును విచారించిన సీఐ అందులో వాస్తవాలు లేవని గుర్తించి కేసును పెండింగ్‌లో ఉంచారు.
ఎంత బతిమాలినా...
ఈ కేసులో తమ తప్పేమీ లేదని, తాము చిరు వ్యాపారులమని, తమ పాపకు కూడా అనారోగ్యంగా ఉందని బాధితులు బతిమాలారు. అయినా కూడా సీఐ వినలేదు. కేసును తప్పుడు కేసు అని కోర్టుకు రెఫర్ చేయాలంటే.. మీపై కేసు లేకుండా చేయాలంటే రూ.లక్ష డిమాండ్ చేశాడని బాధితులు ఆరోపించారు. ఇందుకు హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ మధ్యవర్తిత్వం వహించాడు. రూ.90వేలకు బాధితులకు, సీఐకి మధ్య బేరం కుదుర్చారు. బాధితులు వారం రోజుల క్రితమే రూ.10వేలు హెడ్ కానిస్టేబుల్ రవికుమార్‌కు ఇచ్చాడు. మిగతా రూ.80వేలు ఇచ్చేందుకు వారం రోజులు గడువు కోరారు. ఈ 80వేలు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆదివారం సీఐకి ఫోన్‌చేశారు. హెడ్‌కానిస్టేబుల్ రవికుమార్‌కు ఇవ్వాలని సూచించడంతో కొత్తబస్టాండు వద్ద నిర్మల హోటల్‌లో హెడ్‌కానిస్టేబుల్ రవికుమార్ రాగానే ఆయనకు రూ.80వేలు అప్పగించారు. అతడు ఆడబ్బులు తీసుకుని హోటల్‌లో ఉన్న క్యాష్ కౌంటర్‌లో పెట్టాడు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను సీఐ సూచనల మేరకు తీసుకున్నానని ఏసీబీ అధికారుల ముందు వాపోయాడు.
పదేళ్లకు పైగా జైలు.. అని బెదిరింపులు
ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సీఐ మధుసూదన్‌గౌడు పెండింగ్ కేసు వివరాలు బయటకు తీశాడు. ఇందులో బెస్త రఘుకు చెందిన కేసు పెండింగ్‌లో ఉందని గుర్తిం చాడు. ఈ కేసులో నిందితులైన బెస్త రఘు, బెస్త రవిలను నెల క్రితం స్టేసన్‌కు పిలిపించాడు. మీపై కేసు ఉందని వివరణ ఇవ్వాలని ఆదేశించాడు. వీరు కేసు వివరాలకు సీఐకు వివరించారు. అయినా ఆయన సంతృప్తి చెంద లేదు. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రకారం మిమ్మల్ని కోర్టులో హాజరు పరిస్తే రిమాండ్ పడుతుందని, పదేళ్లకు పైగా జైలుశిక్ష పడుతుందని బెదిరించాడు. ఇలా నెలరోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నాడు.
ఏసీబీ అధికారుల అదుపులో సీఐ
సీఐ ప్రధాన నిందితుడు అని తెలుసుకున్న ఏసీబీ అధికారులు ప్రత్యేక టీం ఏల్కూరు బంగ్లా ఉన్న సీఐ ఇంటి వద్ద కాపలా కాశారు. నిర్మల హోటల్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ రెడ్ హ్యాండెడ్‌గా దొరకగానే అక్కడ సీఐని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను స్టేషన్‌కు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. రాత్రి పొద్దుపోయేదాకా స్టేషన్‌లోకి ఎవరినీ రానీయకుండా సీఐని విచారించారు. కర్నూలు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసాచారిని స్టేషన్‌కు పిలిపించి ఆయన సమక్షంలో కేసు వివరాలపై విచారణ చేపట్టారు.
ఏసీబీ ఆధీనంలో సీఐ కుటుంబ సభ్యులు
యెల్కూరు బంగ్లాలో ఉన్న సీఐ కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. వారి సెల్‌ఫోన్లు తీసుకుని ఎవరినీ కూడా బయటి వారిని సంప్రదించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం ఆ ఇంట్లో సోదా నిర్వహించే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.
రూ.100 తక్కువైందని..
పుష్ప సినిమాలో మాదిరిగా ఒక్కటి తక్కువైందనే డైలాగ్‌ను గుర్తుపెట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్ రవికుమార్ దానిని అక్షరాలా పాటించాడు. బాధితులు మొదట రూ.10వేలు ఇచ్చిన సమయంలో ఇంటికి వెళ్లి లెక్కపెట్టుకుని రూ.100 తక్కువైందని మరీ ఫోన్ చేశాడని బాధితులు ఆరోపించారు. ‘తిరిగి ఆ నోటు ఇచ్చే సమయంలో కూడా రూ.100 తక్కువైనా కూడా మా సీఐ ఊరుకోడబ్బా..’ అంటూ చెప్పాడని బాధితులు ఆరోపించారు.
కలకలం..
నగరంలో ప్రధాన పోలీస్ స్టేషన్ సీఐ ఏసీబీకీ చిక్కడం పోలీసుశాఖలో కలకలం రేపింది. ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ సీఐ పట్టుబడటంతో జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
కాళ్లావేళ్లా పడినా కనికరం చూపలేదు
కేసు పరిష్కారం పేరుతో సీఐ నెల రోజులుగా తమను చాలా ఇబ్బంది పెట్టాడు. ఓపక్క వ్యాపారంలో అప్పులై తీవ్రంగా నష్టాల్లో ఉన్న కూడా లంచం డిమాండ్ చేశా డు. తమ తమ్ముని కూతురు ఆరోగ్యం బాగా లేదని కాళ్లావేలా పడినా కూడా కనికరం చూపలేదు.
- బెస్త, రఘు, బాధితుడు