ప్లాట్లు.. పాట్లు
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:37 PM
ప్రతి ఒక్కరికీ ఓ సొంతిల్లు ఉండాలన్నది కల.. ఆ కలను నెరవేర్చుకునేందుకు సగటు మనిషి జీవితాంతం పోరాడుతాడు..
విచ్చలవిడిగా వెలుస్తున్న వెంచర్లు
సౌకర్యాలు అంతంత మాత్రమే
అక్రమ లేఅవుట్లతో అవస్థలు
లబోదిబోమంటున్న బాధితులు
ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి
ఎల్‌ఆర్‌ఎస్‌తో క్రమబద్ధీకరించుకునే అవకాశం
ప్రతి ఒక్కరికీ ఓ సొంతిల్లు ఉండాలన్నది కల.. ఆ కలను నెరవేర్చుకునేందుకు సగటు మనిషి జీవితాంతం పోరాడుతాడు.. రూపాయి.. రూపాయి కూడబెట్టి ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధపడుతున్నాడు. ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా ప్లాటు కావాలి.. దాని కోసం నగర శివారుల్లో వెలుస్తున్న వెంచర్లపై దృష్టి పెడుతున్నాడు.. ఆకర్షణీయమైన బ్రోచర్లు... అదరగొట్టే ప్రకటనలు చూసి స్థలం చూడకుండా ముందడుగు వేస్తాడు.. అనుమతులు ఉన్నాయా.. లేదా అని కూడా ఆలోచించకుండా ప్లాటు కొనుగోలు చేస్తాడు.. అంతా అయ్యాక అక్రమ లేఅవుట్లు అని తెలిసి లబోదిబోమంటున్న బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలంటూ కలెక్టర్‌కు అర్జీలు సమర్పిస్తున్నారు.
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్న లబ్ధిదారులకు పాట్లు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అని కూడా చూడకుండా ప్లాట్లు కొని అవస్థలు పడుతున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తమ వెంచర్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్లాట్లు కొన్నవారు కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చి వెళ్తున్నారు. వాస్తవానికి కాలువలు, విద్యుత్, రోడ్లు, తాగునీటి సౌకార్యల కల్పనతో పాటు పార్కులకు స్థలాన్ని వెంచర్ వేసిన యజమానులు కేటాయించాలి. అవేమీ లేకుండానే నగరపాలక పరిధిలో ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. నగరంలో ఇలా పలు అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారి అవస్థలు వర్ణనాతీతం, అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
అక్రమ వెంచర్లతో...
వ్యవసాయ భూములు, పారిశ్రామిక ప్రాంతాల్లో వెంచర్లకు అనుమతులు ఇవ్వరాదు. వ్యవసాయ, ప్రైవేటు భూముల్లో వెంచర్లు వేయాలంటే నిర్ణీత రుసుము చెల్లించి కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎన్‌వోసీ తీసుకుని ఎకరా, రెండెకరాల్లో ఉంటే లేఅవుట్లు అప్రూవల్ కోసం సంబంధిత గ్రామ పంచాయతీ, అదే 2.50 హెక్టార్లు ఉంటే మున్సిపాలిటీలకు వాటి పరిధికి మించి విస్తీర్ణం ఉంటే కుడాకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము, పర్మిట్ ఫీజు, డెవలప్‌మెంట్ చార్జీ, గ్రీన్ ఫీజ్, డీపీఎంఎస్ యూజర్ చార్జీ, లేబర్ సెస్, కాంపోనెంట్-1,2, రుసుం చెల్లించాలి. కుడా అనుమతుల కోసం ఎకరాకు రూ.70వేల వరకు చలానా రూపంలో చెల్లించాలి. దీంతో పాటు వెంచర్‌లో పట్టణ ప్రణాళిక నిబంధనల ప్రకారం 10శాతం పార్కులకు వదలాలి. ఇతర అవసరాలకు ఓపెన్ సైట్ ఇవ్వాలి. 40అడుగుల విస్తీర్ణంలో రోడ్డు వేయాలి, ఓపెన్ సైట్, రోడ్ల కోసం 45 శాతానికి పైగా వదలాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ ఫీజులకు గండి కొట్టడమే కాకుండా 20, 25, 30అడుగుల విస్తీర్ణం రోడ్డుతో అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. దీంతో కొనుగో లు చేసిన ఉద్యోగులు, చిరువ్యాపారులు, సామాన్యులు నష్టపో వాల్సి వస్తుంది. నాన్ లేఅవుట్ ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవాలంటే అప్రూవల్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగర పరిధిలో 41 అనధికార..
నగర పరిధిలో ఉన్న కల్లూరు మండలం సర్వే నంబరు 680/ఏ2, బీలో 2.5 ఎకరాల్లో వంశీ ఇన్ఫా ప్రాజెక్టు, 1.7 ఎకరాల్లో వీరయ్య కృష్ణమూర్తి జాయింట్ వెంచర్, సర్వే నెంబరు 170 పార్టులో 6.1 ఎకరాల్లో వైష్ణవి లేఅవుట్, 171లో 3.59 ఎకరాల్లో వెంకటేష్, పందిపాడు సర్వే నెంబరు 144,157(పార్ట్)లో 2.22 ఎకరాల్లో సాయి అంజనాద్రి నగర్, పెద్దపాడు గ్రామ పరిధిలో సర్వే నెంబరు 38 పార్టులో 5.8 ఎకరాల్లో ప్రగతి లే అవుట్‌లు ఇవే కాకుండా మిగిలినవి కూడా అధికారులు గుర్తించారు. అర్బన్ మండల పరిధిలోని మామిదాలపాడులో సర్వే నెంబరు34/2లో 4.59 ఎకరాల్లో ఎస్.వీరయ్య, సర్వే నెంబరు.4-2, 4-2ఏ, 4-2బి, 4-2సి, 4-3లో 2.99 ఎకరాల్లో దామోదరం మోహన్, 204బి, 1ఏ2ఏ, 1ఏ3బి, 205-1, 210బి,లో 4.47 ఎకరాల్లో విజయనగర్ కాలనీ, 189, సి2ఏ, 189 సీ2బీలో 2.98 ఎకరాల్లో నందనం నగర్, 171, 2ఏ2ఎఫ్, 1ఏ1బీ, 2ఏ2బి, 17/1 ఏలో 1.62 ఎకరాల్లో శ్రీనిలయంతో పాటు జొహరాపురం, కర్నూలు రూరల మండల పరిధిలోని అక్రమ లే అవుట్లను కార్పొరేషన్, కుడా అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇలాంటి వాటిని ఎల్‌ఆర్‌ఎస్ స్కీంలో క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం ఉంటుంది. కొనుగోలుదారులు సైతం అనుమతులు లేని, నిబంధనలకు విరుద్దంగా ఉన్న స్థలాలు, నిర్మాణాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. జోహ రాపురం-15, మామిదాలపాడు-7, కల్లూరు-8, లక్ష్మీపురం-1, పందిపాడు-1, మునగాలపాడు-4, పెద్దపాడు-4, కర్నూలు-1లో అక్రమ లేఅవుట్లు 35 ఉన్నాయని అధికారులు గుర్తించారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 2025 జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్ కోసం 90రోజులు గడువు ఉంటుంది. ప్రతి ప్లాట్‌కి తప్పకుండా దరఖాస్తు చేసుకుని ఉండాలి. ప్లాట్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ చార్జీలు ఉంటాయి. 5, 10 శాతం ఓపెన్ స్పేస్ లేకపోతే 14శాతం అదనపు చార్జీలు విధిస్తారు. పాత దరఖాస్తులకు కూడా అవకాశం ఉంటుంది. దీనికి సంబంధిచిన పోర్టల్ ఆగస్టు 1నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తుంది. ఎవరైతే ప్లాట్లు కొన్నవాళ్లు, వేసిన వాళ్లకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరణ చేసుకుంటే బ్యాంకు రుణాలు, అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. దీనిని సద్వినియోగించుకోవాలి.
సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్