రూ.500 కోట్లతో బనగానపల్లెకు పైపులైన్: మంత్రి బీసీ
ABN , Publish Date - May 06 , 2025 | 12:06 AM
అవుకు రిజర్వాయర్ నుంచి బనగానపల్లెకు రూ.500 కోట్లలో పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
బనగానపల్ల్లె, మే 5( ఆంధ్రజ్యోతి): అవుకు రిజర్వాయర్ నుంచి బనగానపల్లెకు రూ.500 కోట్లలో పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. జలజీవన్ మిషన్ కింద సోమవారం మండలంలోని ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రూ.35.60లక్షలతో, రాళ్లకొత్తూరులో 31.50లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇల్లూరు కొత్తపే, రాళ్లకొత్తూరు తండాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు లేకుండా పరిష్కరించాలని ఆర్‌అండ్‌బీ డీఈ వేణుగోపాల్, ఏఈ సాయికృష్ణను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళలు తమ వీధుల్లో వాటర్‌పైపులు పగిలిపోయి ఉన్నాయని దీంతో ఐదేళ్లగా తాగునీరు సక్రమంగా రావడంలేదని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వారంలోగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఇల్లూరుకొత్తపేటలో స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. రాళ్లకొత్తూరు తండా ప్రజలు కమ్యూనిటీ హాల్‌కావాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా ఐటీడీఏ కింద ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ట్యాంకులను తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేశామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అన్నింటిని దశల వారీగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఇల్లూరు కొత్తపేట మాజీ సర్పంచ్ రామిరెడ్డి, రామమద్దిలేటిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్, బాలనాయుడు, మహేశ్వర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, పేట్ల శేఖర్, బాలుడు, మొలక కృష్ణుడు పాల్గొన్నారు.